రూటు మార్చిన వైఎస్ జగన్
YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్నారు. నేడు రెండు రోజు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తోన్నారు.
తన పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలో ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. భాకరాపేటలో గల జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో జగన్ మమేకం అయ్యారు. వారందరినీ పేరుపేరునా పలకరించారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అన్ని రకాలుగా పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు. కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలుగుదేశం నాయకులు రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పాల్పడుతూ భయాందోళన వాతావరణం సృష్టిస్తోన్నారని, చంద్రబాబే దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నాడని జగన్ ఆరోపించారు. అలవికాని హామీలను ఇచ్చి, వాటిని నెరవేర్చలేక ఇలా దాడులు సాగిస్తోన్నారంటూ జగన్ ధ్వజమెత్తారు.
రైతు భరోసా అందట్లేదంటూ ఈ సందర్భంగా పలువురు రైతులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ని కష్టాలు ఉన్నా తమ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా రైతు భరోసా మంజూరు చేశామని వారికి గుర్తుచేశారు. అమ్మకు వందనం పథకం ఏమైందో తెలియట్లేదని, ఎప్పుడు అమలవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు.
ఎన్నికల్లో కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యతను తాము తీసుకుంటామని జగన్ చెప్పారు. చట్టసభలో రాష్ట్ర ప్రజల గొంతును వినిపిస్తామని అన్నారు. 2014లో ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు అబద్దపు హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడూ అదే బాటలో కూటమి ప్రభుత్వం వెళ్తోందంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications