'బీజేపీ ఒత్తిడితో చంద్రబాబుతో జగన్ లాలూచీ'
నెల్లూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లాలూచీ పడ్డారని, దీనిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే చంద్రబాబుతో జగన్ లాలూచీ పడ్డారన్నారు.
కేసుల్లో ఉండేవాళ్ళు, కోట్లాది రూపాయల కుంభకోణాల్లో ఉండే వారు ప్రతిపక్షంలో ఉండి, అధికార పార్టీతో పోరాటం చేయలేరన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్‌కు ప్రజలు తీర్పు ఇస్తే ప్రభుత్వ అసమర్థత, తప్పులను ఎండగట్టాల్సింది పోయి, బాధ్యతను మరిచి ప్రతిపక్షంలో కూర్చొనే ఓపిక లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహస్యం చేశారన్నారు.
కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వద్దంటున్నా, మాటా పలుకు లేకుండా అసెంబ్లీని వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. అసెంబ్లీలో లేవనెత్తిన అనేక అంశాలపై చర్చించకుండా అసెంబ్లీ నుండి అలిగి వెళ్లి పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు అసమర్థ పాలనను ఎండగట్టాల్సిన జగన్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి బడ్జెడ్‌పై విమర్శించడమేమిటన్నారు.

రాజధానిపై వడ్డె శోభనాద్రీశ్వర రావు
రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు ప్రాంతంలో బహుళ పంటలు పండే మాగాణి భూములను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు హెచ్చరించారు. తుళ్లూరు ప్రాంత రైతులు స్వచ్ఛందంగా 32 వేల ఎకరాలు అందజేసేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారనేది పచ్చి అబద్దమన్నారు.
పాలకులు, అధికారులు గ్రామాల్లో తిష్టవేసి రైతులను బెదిరించి ఆ పత్రాలను తీసుకున్నారని ఆరోపించారు. భూములిచ్చిన రైతులకు ఏడాదికి ప్రస్తుతం రూ.30 వేలు, రూ.50 వేలు అందజేస్తామని చెప్పినప్పటికీ అసలు ఎన్నేళ్లకు వారికి అందించాల్సిన వాణిజ్య, నివాస భూములను అందజేస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications