వైజాగ్ లో ఇళ్లకు డిసెంబర్ డెడ్ లైన్-అమరావతిలో కుట్రల్ని తిప్పికొట్టండి-జగన్ ఆదేశాలు..
ఏపీలో ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో ఇళ్ల నిర్మాణం ప్రగతిపై అధికారులు వివరాలు అందజేశారు. ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని వెల్లడించారు. రూఫ్ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో 5,68,517 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని తెలిపారు.
వీటిపై స్పందించిన సీఎం జగన్ .. కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలన్నారు. ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

వీలైనంత వైజాగ్ లో పేదలకు నివాసం కల్పించడానికి చర్యలు వేగవంతం చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్లోగా వైజాగ్ లో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. ఇందుకు ఏం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమన్నారు. కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలని కూడా జగన్ ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.
అలాగే సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. 45,101 మంది ఆప్షన్-3 ఎంపిక చేసుకున్నారని, ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక కూడా పూర్తయిందని తెలిపారు. అందరితోనూ బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ ప్రారంభమైందని, నీటి సరఫరా, అప్రోచ్ రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులపై దృష్టిపెట్టామన్నారు. సీఆర్‌డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు, కోర్టు విచారణలో అంశాన్ని అధికారులు ప్రస్తావించారు.
సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణంపై స్పందించిన సీఎం... పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారని, పేదవాళ్ల కడుపు కొట్టడానికి అంతమంది ఏకం అవుతున్నారన్నారు. పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన అన్నారు. గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు. దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలన్నారు.

అనంతరం టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష చేశారు. ఇప్పటివరకూ 71,452 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించిన ప్రభుత్వం, ఈనెలలో మరో 29,496 ఇళ్లను అప్పగించనన్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టులో 49,604 ఇళ్లు ఇస్తామన్నారు. 300 చదరపు అడుగులు ప్లాట్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని (365, 430 చ.అ) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2వేల కోట్లు రుణాలుగా ఇప్పించామని అధికారులు తెలిపారు. దీంతో పాటు టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications