ప్రతీ బూత్ లో 60 శాతం ఓట్లు సాధించడమెలా ? వైసీపీ నేతలకు సీక్రెట్ చెప్పిన జగన్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనం కంటే క్యాడర్ నే ముందుగా సిద్దం చేసుకుంటున్న సీఎం జగన్ ఇవాళ మరో కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే క్యాడర్ తో ప్రాంతాల వారీగా సిద్దం సభలు నిర్వహిస్తున్న జగన్.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 3 వేల మంది కీలక నేతలతో మరో సిద్ధం భేటీ నిర్వహించారు. ఇందులో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు ఎలా సాధించాలన్న దానిపై మరోసారి ప్రధానంగా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

ఇందుకోసం చేయాల్సిన పనులేంటోవారికి స్పష్టంగా చెప్పేసారు. నేతలు ప్రజలకు, ఓటర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎం జగన్ సూచించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ , ప్లానింగ్ పై దృష్టి పెట్టాలన్నారు. రాబోయే 45 రోజులు చాలా కీలకమన్నారు.

రాష్ట్రంలో క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతుందో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్నీ పర్యవేక్షిస్తున్నామని నేతలకు సీఎం జగన్ తెలిపారు. మేము సిద్ధం -మా బూత్ సిద్ధం అనుకుంటూ అందరు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఎన్నికల బూత్ లోనూ 60 శాతం ఓట్ల సాధనే లక్ష్యంగా పని చేయాలని నేతలకు జగన్ సూచించారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి ఆ మేరకు వారికి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
చంద్రబాబులా తాము తప్పుడు హామీలు ఇచ్చి విస్మరించలేదని, అమలయ్యే హామీలే ఇచ్చి అమలు చేసి చూపించామని జగన్ నేతలకు తెలిపారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఇంటింటికీ వెళ్లి చెప్పాలని సూచించారు. ఈ ఎన్నికలు కులపోరు కాదని వర్గపోరు అని గుర్తుచేశారు. జగన్ ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఇంటింటికీ చెప్పాలన్నారు. వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమం ఆగిపోతుందని హెచ్చరించాలన్నారు.
ఎమ్మెల్యేలు, ఏసీసీలంతా బూత్ సామర్ద్యాన్ని అంచనా వేయాలని, ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకుని ఓ విశ్వసనీయ వ్యక్తిని నియమించుకోవాలన్నారు. అలాగే ఎల్లప్పుడూ జనానికి అందుబాటులో ఉండాలని, అర్ధరాత్రి కాల్ లు వచ్చినా సమాధానం చెప్పాలన్నారు. స్వయంసేవకులు, గృహ సారథులతో అటాచ్ అయి మీ స్వంత బృందాన్ని తయారు చేసుకోవాలన్నాు. ప్రతి బూత్ టీమ్‌లో 15-18 మంది సభ్యులు ఉండాలన్నారు. నా సామర్థ్యంలో చేయగలిగినదంతా చేశానని, ఇప్పుడు మీ వంతని తెలిపారు.












Click it and Unblock the Notifications