పట్టు వీడని జగన్, అనూహ్య నిర్ణయం - ఇక..!!
మాజీ సీఎం జగన్ తన పట్టు వీడటం లేదు. అసెంబ్లీకి జగన్ గైర్హాజరవుతున్నారు. సభలో వైసీపీ ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉందని.. ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సభలో సంఖ్య పరంగా సాధ్యం కాదని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో హోదా లేకపోయినా.. మాట్లాడేందుకు సమయం ఇస్తే సభకు వస్తామని జగన్ పార్టీ నేతల భేటీలో చెప్పుకొచ్చారు. కాగా, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు పైన కూటమి నేతలు టార్గెట్ చేస్తున్న సమయంలో జగన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం మరో కీలక అడుగు వేసారు. ఇదే అంశం పన హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రతిపక్షనేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని... దానిని రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12-బికి విరుద్ధమని ప్రకటించాలని కోరారు.

ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని విన్నవించారు. ఇందులో శాసన సభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
గతంలోనే మాజీ సీఎం జగన్ తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ జూలైలో పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ రూలింగ్‌ను రద్దు చేసి, తనను ప్రతిపక్షనేతగా గుర్తించాలంటూ జగన్ మంగళవారం మరో పిటిషన్ వేశారు. అందులో తనది అసమంజసమైన కోరికగా స్పీకర్ రూలింగ్ లో పేర్కొన్నారని... అందులోని భాషను పరిశీలిస్తే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుగా ఉందని వివరించారు.
న్యాయ నిష్పాక్షికత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థ ప్రతిపక్షమనే మూలసూత్రాన్ని స్పీకర్ విస్మరించారని పేర్కొన్నారు. ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 12-బిలో ప్రతిపక్ష నేతను నిర్వచించారు. దీని ప్రకారం ఆ హోదా పొందేందుకు తాను అర్హుడినని జగన్ పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రానుంది. దీంతో.. కోర్టులో జరిగే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications