రూటు మార్చిన జగన్, అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యం గా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతుతో కొత్త లెక్కలు మొదలయ్యాయి. కూటమిలో కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ జగన్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
మాజీ సీఎం జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు సభలో ప్రతిపక్ష హోదా కోసం జగన్ డిమాండ్ చేసారు. అందులో భాగంగా సభకు హాజరు కావటం లేదు. జగన్ తో పాటుగా వైసీపీ సభ్యులు సభకు గైర్హాజరవుతున్నారు. కాగా, వర్షాకాల శాసనసభ సమావేశాలను సెప్టెంబరు 17 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై సెప్టెంబరు 4న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా, ఈ సమావేశాలకు జగన్ హాజరు కావాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావటంతో.. హామీల అమలు తో పాటుగా పాలనా పరమైన అంశాలను సభలో ప్రస్తావించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సభకు హాజరు కాకపోవటం ద్వారా వస్తున్న విమర్శలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో అమరావతి విషయంలో జగన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. తన మూడు రాజధానుల నిర్ణయానికి ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకపోవటం తో తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి పైన ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా.. నిర్మాణంలో అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపిస్తున్నారు. రెండో విడత భూ సమీకరణ పైన ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. లిక్కర్ కేసులో అరెస్ట్ ల అంశంలోనూ సభలో మాట్లాడాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో, జగన్ సభకు హాజరు అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications