రైతులు రౌడీలు, దొంగల్లా కనిపిస్తున్నారా?
YS Jagan: మామిడి కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.
పండిన పంటను కొనేవాడులేక రెండు నెలలుగా తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు మామిడి రైతులు పారబోస్తున్నారని, ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమేనని జగన్ గుర్తు చేశారు. వీళ్లంతా చంద్రబాబు కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.

కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా తాము రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తే, ఆ కార్యక్రమంపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని జగన్ అన్నారు.
చంద్రబాబు సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలుగానే కనిపిస్తారని విమర్శించారు.
అసలు వీరికి ఏ ఒక్క సమస్యా లేదని, అన్ని హామీలూ తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా చంద్రబాబు వక్రభాష్యానికి అర్థం అని ప్రశ్నించారు. తమకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారని చంద్రబాబు ఉద్దేశంగా కనిపిస్తోందని జగన్ అన్నారు.
కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది?, బంగారుపాళ్యంలో తన పర్యటన కార్యక్రమం ఖరారు కాగానే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు?.. దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? అని జగన్ ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏ రోజు ఇలాంటి కష్టం రాలేదని జగన్ గుర్తు చేశారు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చిందని, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయని నిలదీశారు. ప్రతి ఏటా మే 10-15 తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు.
సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబు పట్టించుకోలేదని, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టయిందని జగన్ ధ్వజమెత్తారు. గల్లా ఫ్యాక్టరీ, శ్రీని ఫుడ్స్‌కు.. ఇలా టీడీపీ నాయకులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా? అని నిలదీశారు.
తమ ప్రభుత్వ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ. 29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, వాటికి సమాధానాలు చెప్పలేక రైతుల మీద, తమ మీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా? అని ప్రశ్నించారు.
గత ఏడాది ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా రూ. 20,000 ఇవ్వలేదని, జూన్ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాది కూడా దాని గురించి ప్రస్తావించడం లేదని జగన్ పేర్కొన్నారు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా రైతుల పరిస్థితి అగమ్యగోచరమేనని, తమ హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేదని వివరించారు.












Click it and Unblock the Notifications