చంద్రబాబు పాలనపై జగన్ అభిప్రాయం
Nallapareddy Prasanna Kumar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేశారు. వీరంగం సృష్టించారు. ఫర్నిచర్ మొత్తాన్నీ ధ్వంసం చేశారు. ఏ వస్తువును కూడా మిగలనివ్వలేదు.
సోమవారం రాత్రి నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో నివసిస్తోన్నారు నల్లపరెడ్డి. రాత్రి దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. విలువైన వస్తువులను ధ్వంసం చేశారు.

అంతకు ముందు కోవూరులో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. ఆ సమావేశాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారని, దాని తరువాతే ఈ ఘటన జరిగినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసగా ఆమె వర్గీయులు, అనుచరులు ఈ ఘోరానికి పాల్పడినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకుని పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. చంద్రబాబు పాలన మొత్తం కూడా మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులుగా కొనసాగుతోందని విమర్శించారు.
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై ఈ దాడి జరిగిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జగన్ అన్నారు. వయోధిక వృద్ధురాలైన ప్రసన్నకుమార్ రెడ్డి తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడిగా జగన్ అభివర్ణించారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోందని, తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండమని జగన్ చెప్పారు.
రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా తలపెట్టిన తన పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు.
ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దాని మీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన హింసాత్మక విధానాలు, దాడులు, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications