ఎమ్మెల్యేల ఫిరాయింపులు: చేతులెత్తేసిన వైయస్ జగన్?
హైదరాబాద్: ఫిరాయింపులను నిరోధించడానికి ఏ విధమైన ప్రయత్నాలు కూడా చేయకూడదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. పార్టీ పెట్టినప్పుడు తాను, తన అమ్మ మాత్రమే ఉన్నామని ఆయన అనడాన్ని బట్టి ఆ విషయం తెలిసిపోతోంది.
ఆ మాట ఆయన విరక్తిగానో, విసుగుతోనో అనడం లేదని కూడా అర్థమవుతోంది. తనకు అత్యంత సన్నిహితులైన, దాదాపుగా కుటుంబ సభ్యులైన భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ఆయన తీవ్ర వేదనకు గురయ్యారని అంటున్నారు. వారిని నిరోధించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. కానీ వారు ఆగిపోలేదు.
ప్రస్తుతం సీనియర్ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూతో పాటు మరో ముగ్గురు తూర్పు గోదావరి జిల్లా శాసనసభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వారితో పాటు మరో ఐదారుగురు టిడిపిలో చేరుతారని అంటున్నారు. ఆ రకంగా 21 మంది వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులను లక్ష్యం చేసుకుని చంద్రబాబు ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే, జగన్ వెళ్లిపోయే ఎమ్మెల్యేలను ఆపకూడదనే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వారంతా తన ఇమేజ్ మీద గెలిచినవారే తప్ప సొంత బలంతో గెలిచినవారు కాదని ఆయన నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. అదీ కాకపోతే, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల వారంతా గెలిచారని ఆయన అనుకుంటుండవచ్చు. ప్రజలు తన వెంట ఉన్నంత వరకు ఎవరు వెళ్లినా ఏమీ కాదనే ధీమాతో కూడా ఆయన ఉన్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి సమీకరణాలు మారక తప్పదనేది ఆయన అంచనాగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో తీవ్రమైన ఆసంతృప్తి నెలకొని ఉందని, వచ్చే ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుందని, ఆ సమయంలో తన పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వస్తారని కూడా ఆయన భావిస్తూ ఉండవచ్చు.












Click it and Unblock the Notifications