ఆరు నెలల్లో జగన్ పార్టీ ఖాళీ: సిఎం రమేష్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆరు నెలల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాళీ అవుతుందని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అన్నారు. నంద్యాల, కర్నూలు వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలు ఆదివారం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయి, తమ పార్టీలో చేరారని ఆయన చెప్పారు.
రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు, దేశాన్ని ఎన్డీయే ప్రభుత్వాలు అయితేనే అభివృద్ధి చేయగలవని వారన్నారని రమేష్ ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీలో చేరి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆ ఇద్దరు ఎంపీలు చంద్రబాబుకు చెప్పారని, దీనిపై స్పందించిన చంద్రబాబు వారికి టిడిపి కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారని రమేష్ తెలిపారు.

అలాగే మరి కొంత మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే వారిలో పార్టీకి పూర్తిగా సహకరించి, అభివృద్ధికి తోడ్పాటు చేస్తారో వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు నుంచి గెలిచినప్పటి నుంచి ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలు పార్టీకి దూరంగా ఉన్నారని, జగన్ వ్యవహారశైలి, పార్టీలో ప్రాధాన్యత లేకపోవడమే కారణమని తెలియవచ్చింది. జగన్ మోడీని కలవడం వ్యూహాత్మక తప్పిదమని వైయస్సార్ కాంగ్రెసు సీనియర్ నేతలు అంటున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications