YS Jagan-SLBC Meeting : వ్యవసాయం, MSMEలకు రుణాలిచ్చిన బ్యాంకర్లు-విద్య, హౌసింగ్ కు ఇమ్మన్న జగన్
వచ్చే ఆర్ధిక సంవత్సరంలో విద్య,గృహనిర్మాణ రంగాలకు రుణాలివ్వాలని బ్యాంకర్లను సీఎం జగన్ కోరారు.
అమరావతి: సీఎం వైయస్.జగన్‌అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఇవాళ రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఇందులో గత ఏడాది ఎంతమేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నది బ్యాంకర్లు వెల్లడించారు. ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపుగా ఇచ్చామనీ, మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువరుణాలు ఇచ్చామన్నారు.
రాష్ట్రస్ధాయిలో ప్రాథమిక రంగానికి 2022-23 ఏడాదికి రుణప్రణాళిక లక్ష్యం రూ. 2,35,680 కోట్లు కాగా... ఇచ్చిన రుణాలు రూ. 2,34,442 కోట్లని బ్యాంకర్లు తెలిపారు. దీంతో 99.47శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వెల్లడించారు. వ్యవసాయరంగానికి రుణాల లక్ష్యం రూ. 1,64,740 కోట్లు కాగా 1,72,225 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇది 104.54 శాతం అన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ. 50,100 కోట్లు కాగా, రూ. 53,149 కోట్లు ఇచ్చామన్నారు. ఇది 106.09 శాతం అని తెలిపారు. ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ. 1,63,903 కోట్లు ఇచ్చామని బ్యాంకర్లు వెల్లడించారు. ఈ రంగంలో దాదాపుగా రెట్టింపు స్థాయిలో 195.59శాతం మేర రుణాలు ఇచ్చామని తెలిపారు.

బ్యాంకర్లు అందించిన వివరాలపై స్పందించిన సీఎం జగన్.. రాష్ట్రంలో బ్యాంకింగ్ వ్యవస్థ విజయాలు సాధించినందుకు సంతోషిస్తూ వారికి అభినందనలు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించిందని, ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు. కొన్ని రంగాలకు సంబంధించి పనితీరు చాలా ప్రశంసనీయమన్నారు.
విద్య, గృహ నిర్మాణ రంగాల రుణాలు లక్ష్యాల కన్నా తక్కువగా ఉన్నాయని జగన్ బ్యాంకర్లకు తెలిపారు. విద్యారంగానికి కేవలం 42.91శాతం, గృహనిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చాయన్నారు. సామాజిక -ఆర్థిక ప్రగతిలో ఈ రెండు రంగాలు అత్యంత కీలకమన్నారు. బ్యాంకర్లు ఈ రెండు రంగాలపై మరింత సానుకూల దృక్పథంతో, అనుకూల కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున చేపడుతున్న గృహనిర్మాణం కారణంగా ఈ రంగంలో బ్యాంకులు మరింత ఊతమివ్వాలన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో స్వల్పకాలిక పంట రుణాలు 83.36శాతం మాత్రమే ఇచ్చారని, దీనికి సంబంధించిన కారణాలపై దృష్టి పెట్టి ఎస్‌ఎల్బీసీ సరైన చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు కూడా డిసెంబర్ 2022 వరకు కేవలం 49.37% లక్ష్యాన్ని మాత్రమే సాధించామన్నారు.
మహిళా స్వయంసహాయ సంఘాలకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు తగిన పరిశీలన చేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా చూడాలని సీఎం జగన్ కోరారు. ఈ వడ్డీ రేట్లను పర్యవేక్షించడానికి... అధికార్లు, బ్యాంకర్లు కలిసి సమావేశం కావాలన్నారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, పాఠ్యప్రణాళిక, కోర్సులు బోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్దేశించేందుకు యూనివర్శిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేస్తోందని, ఆయా కార్యక్రమాలకు బ్యాంకులు బాసటగా నిలవాలని జగన్ కోరారు. అలాగే నాబార్డు, బ్యాంకులు డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications