వైఎస్ జగన్‌కు వాస్తవాన్ని వెల్లడిచేసిన సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' ఆయనకు సానుకూల ఫలితాలను అందించింది. రాబోయే ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఎమ్మెల్యేలపైనే ఆధారపడివుందని, మీ పనితీరు మార్చుకోకపోతే సీటిచ్చేది లేదని జగన్ వారికి ఖరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. వీరితో సమావేశమైనప్పుడు కొందరు ఎమ్మెల్యేలు బాగానే పనిచేస్తున్నామని చెప్పడంతో ఎవరు పనిచేస్తున్నారో తనకు తెలుసని, తనవద్ద సర్వే నివేదికలున్నాయని జగన్ చెప్పారు.

అప్పుడు 50 మంది ఎమ్మెల్యేలు..
ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన సమయంలో పీకే సర్వేతోపాటు పలు సంస్థల ద్వారా తెప్పించుకున్న సర్వే నివేదికలన్నింటినీ క్రోడీకరించిన జగన్ 50కి పైగా ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని, ఆరునెలల్లోగా పనితీరు మెరుగుపడకపోతే సీటిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు బాగోలేదో ఉదాహరణగా కొన్ని పేర్లు కూడా చదివారు. సమయం కూడా ఎక్కువగానే ఇస్తున్నానని, అప్పటికీ మారకపోతే చివరి నిముషంలో తనను విమర్శించినా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.

గడప గడపకు వెళుతున్న శాసనసభ్యులు
ఆ తర్వాత నియోజకవర్గాలకు వెళ్లిన ఎమ్మెల్యేలు 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతిరోజు, ప్రతి గడపను తడుతున్నారు. ప్రజలు వారి సమస్యలను తెలియజేస్తుండటంతో అధికారుల ద్వారా అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. పనితీరు మార్చుకున్నవారు 25 మంది ఉన్నారని, గతంలో 50మందికిగాను 25 మంది పనితీరు మెరుగు పడిందని జగన్ తెప్పించుకున్న మరో సర్వే నివేదిక వెల్లడించింది.

ఇప్పటికీ మారనివారు 25 మంది
ఈ 25 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ పనితీరు మార్చుకోవడంలేదని, వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారేనని ఆ నివేదికలో తేలింది.
దాదాపుగా వీరి పనితీరు మారే అవకాశం కూడా లేదని స్పష్టం చేసినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో జగన్ ఈ 25 మందిపై దృష్టిసారించారు. సాధ్యమైనంతవరకు వారికి పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున తోడ్పాటునందిస్తామని, అప్పటికీ మారకపోతే చేయగలిగిందేమీ లేదని పార్టీ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications