విపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై జగన్ రియాక్షన్ ఇదే! కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో తాజా సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి ప్రధాన విపక్ష హోదా ఇచ్చేందుకు కూటమి సర్కార్ నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు విపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో చెప్పేశారు. అలాగే తనను కొలంబియా డ్రగ్ నియంత పాబ్లో ఎక్సోబార్ తో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకూ జగన్ కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ కూటమి సర్కార్ 50 రోజుల పాలన మీద ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా వివరించిన జగన్.. వాస్తవంగా దీనిపై అసెంబ్లీలోనే మాట్లాడాల్సి ఉందన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్షంగా గుర్తించరట, ఆ ప్రతిపక్ష పార్టీకి ఉండే నాయకుడిని గుర్తించరట
గుర్తిస్తే తప్పనిసరిగా విపక్ష నేతకు ఓ హక్కుగా మైక్ ఇవ్వాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. సభానాయకుడు మాట్లాడాక, విపక్ష నేతకు కూడా అంతే సమయం మైక్ ఇవ్వాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీలో ఉండేది రెండే పక్షాలని, ఒకటి అధికార పక్షం, రెండోది విపక్ష పార్టీ మాత్రమేనన్నారు.

చంద్రబాబు చేస్తున్న పనులకు గొంతు విప్పి ఇవన్నీ మాట్లాడే పరిస్ధితి రావాలని జగన్ తెలిపారు. ఇవన్నీ ఎవరూ మాట్లాడకూడదు, ఎవరూ అడగకూడదు, ఎవరూ రోడ్డు మీదకు రాకూడదు, ఎవరూ అసెంబ్లీలో ప్రశ్నించకూడదు, తామేం చేసినా మాట్లాడకూడదన్న దుర్మార్గ ఆలోచనతోనే చంద్రబాబు చేస్తున్నారు కాబట్టే తాను ఇకపై ఇదే విధంగా మాట్లాడతానన్నారు.
మరోవైపు చంద్రబాబు తనను కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కో బార్ తో పోల్చడంపై స్పందిస్తూ.. ఈయన చంద్రబాబు స్నేహితుడేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆయన బాగా తెలిసినట్లున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ఇండియా కూటమి తమ ఢిల్లీ ధర్నాకు ఇచ్చిన మద్దతుపై స్పందిస్తూ.. రాష్ట్రంలో జరుగుతున్న హింసను తెలుసుకోవాలనే వారిని పిలిచామన్నారు. అయితే ఇందులో కొన్ని పార్టీలు వచ్చాయని, అందులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో వారినే అడగాలన్నారు. రేవంత్ ద్వారా కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి తమ ధర్నాకు రాకుండా అడ్డుకున్నారన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో గొడవలే ప్రశ్నిస్తారా అని అడిగారు.












Click it and Unblock the Notifications