వైసీపీ గెలిచిన చాలాచోట్ల ఫలితాల తారుమారు ? పార్టీ నేతలతో జగన్ కామెంట్స్..!
ఏపీలో తాజాగా జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పలు చోట్ల అనూహ్య ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికలకు ముందు వైసీపీపై ఉన్న అంచనాలకు మించి సాధించిన ఈ ఫలితాలు పార్టీలో సహజంగానే జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan ) ఇవాళ ఎన్నికల్లో గెలిచిన పలువురు అభ్యర్ధులు, జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కేడర్ అంతా కసితో గట్టిగా పోరాటం చేశారని జగన్ తెలిపారు.
చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారని, వారికి కూడా బాగా అర్థమైందని జగన్ తెలిపారు. 2024 ఎన్నికలతో పోలిస్తే వైయస్సార్‌సీపీ ఓటింగ్ శాతాలు పెరిగాయని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూలు దగ్గరనుంచి, ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగినా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. సజావుగా ఎన్నికలు జరిగి ఉంటే, వైయస్సార్‌సీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్ పర్సంటేజీ నమోదయ్యేదన్నారు. ఇది బయటకు వస్తే, తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే చంద్రబాబు అరాచకాలు చేశాడన్నారు. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారని, ఇవన్నీ దాటుకుని విజయాలు సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి, ఫలితాలు తారుమారు చేశారన్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ నిందలు మోపి, లేని అబద్ధాలు చెప్పి, ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు, అక్రమాలను చంద్రబాబు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరిట నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన పార్టీ నాయకులు..
తమ రాజకీయ జీవితాల్లో ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులు బౌన్సర్లు పెట్టి నడిపారని వెల్లడించారు.
అభ్యర్థుల బంధువులను కిడ్నాప్ చేసి, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారని, ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్లు పేరిట చాలా వరకు వైయస్సార్‌సీపీ ఓట్లు తీసేశారని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో కరెంటు ఆపి మరీ ఫలితాలు తారుమారు చేశారని, వైయస్సార్‌సీపీ గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్‌లు చేసి, లెక్కలు తారుమారు చేశారన్నారు. వైయస్సార్‌సీపీ అడిగిన చోట రీకౌంటింగ్‌లు మాత్రం చేయలేదన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్ పేపర్లు ఇచ్చి, వారిని గెలిపించేలా అక్రమాలు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేయించిన దాడుల కారణంగా గ్రామ గ్రామాన చంద్రబాబు బాధితులు ఉన్నారని వారు జగన్ కు తెలిపారు.















Click it and Unblock the Notifications
