బాబు లక్షకోట్ల అవినీతి: ఢిల్లీ లీడర్లకు జగన్ 'ఎంపరర్ ఆప్ కరప్షన్' బుక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రెండేళ్లలో ఎన్ని అనైతిక చర్యలకు పాల్పడ్డారో.. అందుకు సంబంధించి ఆధారాలతో సహా ఆయన పైన 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకాన్ని తీసుకు వచ్చామని, దీనిని జాతీయ నేతలకు ఇస్తున్నామని వైసిపి అధినేత జగన్ అన్నారు.
ఆయన మంగళవారం ఉదయం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ఆయనకు చంద్రబాబుపై రాసిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ఇచ్చారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏ రకంగా అనైతిక చర్యలకు పాల్పడుతున్నారో మేం పుస్తకం ద్వారా అందరికి తెలియజేస్తున్నామని చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నారు. మంత్రి పదవులు, డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రిని నాతో పాటు ప్రతి వ్యక్తి నిలదీయాలన్నారు.
చంద్రబాబుకు ఇంత అవినీతి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అందరూ ప్రశ్నించాలన్నారు. తాము ఓ పుస్తకం విడుదల చేస్తున్నామని, ఇందులో ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు చేసిన ప్రతి అవినీతిని ఆధారాలతో పాటు ఇచ్చామన్నారు.
ఇసుక మాఫియా నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వరకు ఆయన అవినీతిని ఇందులో పేర్కొన్నామని చెప్పారు. ఇందులో చంద్రబాబుపై ఆధారాలు పూర్తిగా ఉన్నాయన్నారు. చేరికలు, అవినీతి విషయంలో టిడిపి తీరును జాతీయ నేతలకు వివరిస్తున్నామని చెప్పారు.
మంత్రి పదవులు, డబ్బులు చూపించి తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
డబ్బుగకు లొంగి వారిని మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారని, అందుకే తాము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఢీల్లీ పెద్దలను కలిసేందుకు వచ్చామని చెప్పారు. ఈ రోజు ముఖ్యమైన నేతలు అందర్నీ కలవబోతున్నామని చెప్పారు.

చంద్రబాబుకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని, ఎన్నికలకు వెళ్తే ఓట్లు రావనే విషయం ఆయనకు తెలుసునని చెప్పారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోమని చెప్పి నిరుద్యోగులను.. ఇలా అందర్నీ మోసం చేశారన్నారు.
చంద్రబాబు పాలన మాకొద్దు బాబో అని ఇప్పుడు ప్రజలు విలపిస్తున్నారన్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకన్న చంద్రబాబుకు.. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఆడియో, వీడియోలతో దొరికిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించకూడదని ఓటుకు నోటును ఉద్దేశించి అన్నారు.
అమరావతి పేరుతో భూముల దోపిడీ, కరెంటు దోపిడీ, ఇసుక మాఫియాలను ఇలా అన్ని అంశాలు తమ పుస్తకంలో పొందుపర్చామన్నారు. మొత్తం లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారం ఈ పుస్తకంలో ఉందని చెప్పారు. పూర్తి ఆధారాలతో, డాక్యుమెంట్లతో ఈ పుస్తకం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications