మీకిదే సువర్ణావకాశం.. ఓదార్పు యాత్రపైన వైఎస్ జగన్ సంచలన నిర్ణయం!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం పైన దృష్టి సారించారు. గ్రామస్థాయిలో నిర్మాణాత్మకంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని వైసిపి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీని బలోపేతం చేయడంలో వైసిపి నేతల పనితీరు పైన మానిటరింగ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి
నేడు తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మరియు అనుబంధ సంఘాల నేతలతో సమావేశమైన వైయస్ జగన్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇతర అంశాల పైన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.వైసిపి నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని, బాగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

పనితీరు ఆధారంగా ప్రమోషన్లు, వారికి రేటింగ్స్
ఇక జిల్లా అధ్యక్షులు పనితీరు ఆధారంగా వారికి ప్రమోషన్లు ఉంటాయని చెప్పిన జగన్, దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తయారు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ కోసం ఎవరైతే బాగా పని చేస్తారో వారికి రేటింగ్స్ ఇస్తామని, రిపోర్టుల ఆధారంగా నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మీకిదే సువర్ణావకాశం అన్నారు.
ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేఖత లేదు
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఓటమి పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించి 17 లక్షల శాంపిల్స్ తీసుకున్నామని చెప్పిన జగన్ ఆ సర్వేలలో ఎక్కడ వైసీపీ వ్యతిరేకత కనిపించలేదని స్పష్టం చేశారు. వైసిపి పట్ల వ్యతిరేకత లేకపోయినా ఎన్నికల ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వారిని పరామర్శిస్తా
ఇక రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల పైన దాడులు పెరిగాయని వారిని అడుగడుగునా టిడిపి నాయకులు ఇబ్బంది పెడుతున్నారని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలో ఇబ్బంది పడుతున్న నష్టపోయిన కార్యకర్తలను త్వరలోనే తాను పరామర్శిస్తానని ,వారందరికీ భరోసా ఇస్తానని వైయస్ జగన్ స్పష్టం చేశారు.
ప్రజా క్షేత్రంలోకి ఓదార్పు యాత్రతో జగన్
వైసిపి కార్యకర్తలపై దాడులను అందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక జిల్లా స్థాయిలోను వైసీపీ నేతలంతా ఒక్కటిగా ఉండాలని కార్యకర్తలకు అండగా ఉండి ఆదుకోవాలని జగన్ సూచించారు. త్వరలోనే వారందరికీ భరోసా ఇచ్చేందుకు ఓదార్చేందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తానని జగన్ తన వ్యాఖ్యల ద్వారా మరోమారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications