రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన, ఆ ఇద్దరిదే బాధ్యత - జగన్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ టీడీపీ ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిక చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని చెప్పుకొచ్చారు. హత్య చేసిన వారిని చంద్రబాబు, లోకేష్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు.
పరామర్శ
మాజీ సీఎం జగన్ నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన పార్టీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. హత్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు పాలన పైన మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన మంచి చేయాలనే ఆలోచన లేని ప్రభుత్వం కనిపిస్తోందన్నారు. గత రెండున్నార నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పాలన అరాచకం సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. మారణ హోమం కొనసాగుతోందన్నారు. మోసం చేస్తూ ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు.

చర్యలు తీసుకోవాలి
ప్రజలు ప్రశ్నించకూడదనే ఆలోచనతో భయానక వాతావరణం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని ఒక్కటీ అమలు చేయటం లేదని ఫైర్ అయ్యారు. పిల్లలకు రూ 15 వేలు, మహిళలకు రూ 18 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చి మోసం చేసారని చెప్పుకొచ్చారు. తల్లికి వందనం పేరుతో తల్లికి పంగనామం పెట్టారన్నారు. వ్యవసాయ సీజన్ మొదలైంది. జగన్ ఉండి ఉంటే రైతు భరోసా అందేదన్నారు. రైతులను మోసం చేసారని విమర్శించారు. ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా చంద్రబాబు, ఆయన కుమారుడు రెడ్ బుక్ పాలన చేస్తున్నారని ఆరోపించారు.
వారిదే బాధ్యత
గ్రామాల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే లా అండ్ ఆర్డర్ ను నాశనం చేస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా కూర్చున్నారని సుబ్బారాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసారన్నారు. 35-40 మంది బయట నుంచి వచ్చి రాడ్లు, తుపాకులు, కత్తులతో స్వైర విహారం చేసారని వివరించారు. సమాచారం ఉన్నా ఫోర్స్ ను మాత్రం పంపలేదన్నారు. పోలీసుల సమక్షంలో ఘటన జరిగిందని ఆరోపించారు. ఘటనలు చేయిస్తున్న నేతల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చటం లేదని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేస్తామని వెల్లడించారు. ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేలా చేస్తామని జగన్ చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఎందుకు చర్యలు తీసుకోరని జగన్ నిలదీసారు.












Click it and Unblock the Notifications