భయపడను, తగ్గేది లేదు - చంద్రబాబు ఢిల్లీ మంత్రాంగంపై జగన్..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మాజీ సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటన పైన జగన్ స్పందించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా... మిర్చి యార్డుకు వెళ్లటం ఉల్లంఘనగా పేర్కొంటూ తన మీద నమోదు చేసిన కేసు పైన జగన్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది అక్కడ సీఎం ప్రమాణ స్వీకారం కోసమైతే.. కలరింగ్ మరోలా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం చేసినా తాను భయ పడేది లేదని.. వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు.
జగన్ పై కేసుతో
మాజీ సీఎం జగన్ సహా ఎనిమిది మంది వైసీపీ నేతల పైన కేసు నమోదు అయింది. మిర్చి రైతుల సమస్యల పైన జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ తనకు భద్రత ఇవ్వకపోవటం పై జగన్ నిలదీసారు. దీని పైన సీఎం చంద్రబాబు ఢిల్లీలో స్పందించారు. ఎన్నికల కోడ్ ఉండటంతో వెళ్లవద్దని పోలీసులు జగన్ కు సూచించారని చెప్పుకొచ్చారు. జగన్ నిబంధనలను ఉల్లంఘించి వెళ్తే.. అధికారులు సహకరించాలా అని ప్రశ్నించారు. జగన్ మిర్చి రైతుల అంశాలను ప్రస్తావన చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక, ఈ కేసుల అంశం పైన జగన్ రియాక్ట్ అయ్యారు. తన వైఖరి స్పష్టం చేసారు.

మిర్చి రైతుల కష్టాలు
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తే, మిరప రైతుల సమస్ యలపై కేంద్రంతో చర్చించేందుకు వెళ్తున్నట్లు ఎందుకీ కలరింగ్..ఎవరి కోసం ఈ కలరింగ్ అని జగన్ ప్రశ్నించారు. ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి అంటూ నిలదీసారు. ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి.. వారికి బాసటగా వెళ్లిన తమపై కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును తన 'ఎక్స్' ఖాతా ద్వారా ఎండగ ట్టారు. తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన దుస్థితి నెలకొందని చెప్పారు. కొనేవారు లేక క్వింటాల్ రూ.10 వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు.
నిలబడి తీరుతా
తాము స్పందించేంత వరకూ ప్రభుత్వంలో కదలిక లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ.. మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్లు యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగో లు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు తమపై కేసులు పెట్టారని, మరి ఫిబ్రవరి 15న మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్‌కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా అని నిలదీసారు. తప్పుడు కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపే ది లేదని ప్రకటించారు. తాను రైతుల పక్షపాతినని..ప్రజల పక్షపాతినని చెప్పారు. ఎన్ని కేసులు బనాయించినా రైతుల కోసం, ప్రజల కోసం కచ్చితంగా నిలబడతానని జగన్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications