సమయం వచ్చినప్పుడు ఫుట్ బాల్ తన్నినట్టు తంతారు - వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. దారుణమైన పాలన కొనసాగుతోందని సమయం వచ్చినప్పుడు ఏపీ ప్రజలు ఇలాంటి పాలనను ఫుట్ బాల్ తన్నినట్టు తంతారని హెచ్చరించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ భేటీలో కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం.. శ్రీ సత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, చిత్తూరు జిల్లాలోని రామకుప్పం వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
వెన్నుపోటుతో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం మొదలైందని జగన్ ఆరోపించారు. మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 నెలల చంద్రబాబు పాలనలో రాజకీయాలకు.. వైసీపీ హయాంలో రాజకీయాలకు తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని.. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమన్నారు జగన్.

వైసీపీ పాలనలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్త ప్రతి ఇంటికి గర్వంగా పోగలుగుతాడని.. కానీ ఇవాళ చంద్రబాబు, ఆ పార్టీ కార్యకర్తలు తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలరా అని ప్రశ్నించారు. ఏ ఇంటికైనా వాళ్ల కార్యకర్తలు వెలితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారని విమర్శలు గుప్పించారు. చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని.. ఓ తల్లి బయటకు వచ్చి నా రూ.18వేలు ఏమయ్యాయని అడుగుతారని అన్నారు.
చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయని మండిపడ్డారు. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయని వాపోయారు. ప్రజలు ఆ హామీలు ఏమయ్యాయని అఢుగుతున్నారని.. ఉచిత బస్సు ఉంటే కడప నుంచి విశాఖపట్నం.. కర్నూలు నుంచి అమరావతి వెళ్లి వద్దామనుకున్నాం.. అవి ఏమయ్యాయని అడుగుతున్నారన్నారు. స్కూళ్లలో నాడు-నేడు ఆగిపోయిందని.. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంగ్లీష్ మీడియం పక్కకు పోయిందని.. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారని వైసీపీ అధినేత అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు పుణ్యమా అని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయాయన్నారు. పేదవాడు ఏ కార్పోరేట్ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు చికిత్స చేయించుకునే పరిస్థితి వైసీపీ పాలనలో ఉండేదని.. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనమైందన్నారు. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారన్నారు. వచ్చే జగన్ 2.0 లో కార్యకర్తకు పెద్ద పీట వేస్తామని.. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదని చెప్పారు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications