కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదు- మీ పరిస్థితేంటీ: అప్పుడే చేతులు దులుపుకొన్నారు: జగన్

YS Jagan Mohan Reddy: ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొన్ని వివాదాస్పద నిర్ణయాలను తీసుకోవడం దీనికి కారణమైంది.

దీనిపై అధికార టీడీపీ కూటమి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్యుద్దం సాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ చేసిన విమర్శలను మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధురాలు ఆర్ కే రోజా తిప్పి కొట్టారు. ఘాటుగా విమర్శలు గుప్పించారు.

YS Jagan slams Chandrababu govt on Medical colleges

దీనిపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తోంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం అంటూ విమర్షించారు.

ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయమని, దుర్మార్గమని జగన్ మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తోన్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు.

నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అదించడం అనేది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా అని జగన్ గుర్తు చేశారు. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదని చెప్పారు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుందని ప్రశ్నించారు. అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అని అంటారా? అంటూ నిలదీశారు.

విద్య, వైద్యం కోసం ఎవరూ కూడా ఆస్తులను అమ్ముకునే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే తాము ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో పని చేశామని, 8,480 కోట్ల రూపాయలతో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించామని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుందని జగన్ ప్రశ్నించారు.

2023-24 సంవత్సరంలో అయిదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? దీనిద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్‌ చదువులు చదవడం లేదా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు జగన్.

నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలోనే మరో అయిదు కాలేజీలు- మదనపల్లి, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవని జగన్ అన్నారు. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం, పులివెందుల కాలేజీకి మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం, మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరంచేసే స్కామ్‌లకు ఆలోచన చేయడం ఏంటని నిలదీశారు.

కోవిడ్‌ సంక్షోభం సమయంలోనూ తాము మెడికల్‌ కాలేజీల నిర్మాణాల కోసం 2,403 కోట్ల రూపాయలను ఖర్చుచేశామని, అయిదు కాలేజీల్లో తరగతులను మొదలుపెట్టి, మరో అయిదింటిని ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశామని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? అని అన్నారు.

అలా కాకుండా భారం అనే కారణాన్ని చూపుతూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా? ప్ర‌ైవేటు మీద అంత మోజు ఎందుకు?, ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు? అంటూ జగన్ ప్రశ్నించారు. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదని, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం రాకూడదన్న విధానంలో తాము సీట్లను భర్తీ చేస్తే ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారని జగన్ విమర్శించారు.

అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారని చంద్రబాబు- పవన్ కల్యాణ్‌కు గుర్తు చేశారు. ఇప్పుడు సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తోన్నారని, ఇది ఏరు దాటాక తెప్పతగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయటపడిందంటూ ధ్వజమెత్తారు.

లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులో ఉంటే అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుందని, సూపర్‌ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లా స్థాయిలోనే లభిస్తాయని జగన్ అన్నారు.

అలాంటి కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలకు కూడా అని చెప్పారు. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా, వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న విధానం అందరినీ దెబ్బతీస్తుందని, అటు ప్రజలు, ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వాసుపత్రులేనని చెప్పారు.

వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మెడికల్ కౌన్సిల్‌కు రాసిన లేఖను వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, పేదపిల్లలకు వైద్యవిద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+