చిరువ్యాపారులకు అండగా జగనన్న తోడు: మూడోవిడత రుణాలిచ్చి; పాదయాత్రలో వారి కష్టాలు చూశానన్న జగన్
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకం కింద మూడో విడత చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మూడో విడత జగనన్న తోడు రుణాలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. 5,10,462 మందికి 510.46 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టిన జగన్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చిరు వ్యాపారులకు అండగా నిలవటమే జగనన్న తోడు
పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలను దగ్గరుండి చూశానని, చిరు వ్యాపారులకు మంచి చేయాలన్న ఆలోచన తోనే ఈ పథకాన్ని తీసుకు వచ్చాను అని ఏపీ సీఎం జగన్ చెప్పారు. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. చిరు వ్యాపారులు తమ ఉపాధి కల్పించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని జగన్ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిరువ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ పథకం కింద ఇప్పటికి 14.16 లక్షల మందికి లబ్ధి
వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 14.16 లక్షల మందికి లబ్ధి చేరిందని ఆయన పేర్కొన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మళ్లీ మీకు రుణాలు ఇస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. జగనన్న తోడు పథకం మొదటి విడతలో 5.35 లక్షల మందికి, రెండవ విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందించిన ప్రభుత్వం ఇప్పుడు మూడవ విడతలో 5.10లక్షల మందికి రుణాలను అందించింది. మొత్తంగా ఇప్పుడు వరకు 14. 16 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని అధికారిక అంచనా.

చిరు వ్యాపారుల రుణాలకు ప్రభుత్వమే పూర్తి పూచీకత్తు
2020 నవంబర్ 25న ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కో లబ్ధిదారునికి పదివేల చొప్పున రుణాలను అందిస్తోంది. ఈ రుణాలు పొందిన వ్యాపారులు 12 నెలల సులభ వాయిదా లో వీటిని చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తుంది. చిరు వ్యాపారుల రుణాలకు ప్రభుత్వమే పూర్తి పూచీకత్తుగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. నామమాత్రపు లాభాలకే సేవలు అందించే గొప్ప వర్గం చిరు వ్యాపారుల వర్గం అని జగన్ వెల్లడించారు. వారి కష్టాలు అర్ధం చేసుకున్నాను కాబట్టే వారికి అండగా జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చానని వెల్లడించారు.

రుణాలు రాని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి
అర్హత ఉండి కూడా రుణాలు రాని వారు గ్రామ సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ తరువాత విడతలో వారికి కూడా రుణాలను మంజూరు చేస్తామని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తోపుడు బండ్లు, రోడ్ల మీద చిరు దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications