ముఖ్య నేతలకు జగన్ పిలుపు, ఛలో ఢిల్లీ - కీలక నిర్ణయం..!!
ఏపీలో మళ్లీ రాజకీయం ఊపందుకుంటోంది. అటు చంద్రబాబు తన మార్క్ పాలన చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం పాలన మొదలు కావటంతో తీసుకుంటున్న నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. మరోసారి పార్టీ ముఖ్య నేతలకు పిలుపు అందింది. కీలక ప్రకటనకు జగన్ సిద్దం అయినట్లు తెలుస్తోంది.
జగన్ కీలక భేటీ
ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారం దక్కించుకుంటామని జగన్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ, ఊహించని ఫలితాలు వచ్చాయి. కోటి 32 లక్షల ఓట్లు వచ్చినా..సీట్లు మాత్రం 11కే పరిమితం అయ్యాయి. దీంతో, ఓటమి తరువాత జగన్ ను పార్టీ నేతలు వరుసగా కలుస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన నలుగురు లోక్ సభ సభ్యులతో పాటుగా రాజ్యసభలోని 11 మందితో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని ఉభయ సభల్లో వైసీపీకి 15 మంది సభ్యుల బలం ఉందని..అంశాల ప్రాతిపదికన కేంద్రానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.

ఇక జిల్లాల పర్యటన
ఇదే సమయంలో జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే ఈ నెల 19న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్ధాయి సమావేశం ఏర్పాటుకు జగన్ నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులందరినీ కూడా ఆహ్వనించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ భేటీలో కీలక ప్రకటన ఉంటుందని సమాచారం ఇస్తున్నారు.
కార్యాచరణ ఖరారు
జగన్ వచ్చే వారం జిల్లాల పర్యటనలకు వెళ్లాలని నిర్ణయించారు. పులివెందుల పర్యటన కూడా ఫిక్స్ అయింది. అదే విధంగా జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పుడు పార్టీ నేతలతో సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభకు హాజరు అయ్యే అంశం పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తరువాత ప్రజల తరపున పోరాటాలు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీంతో..ఈ సమావేశంలో జగన్ ప్రకటించే నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications