YS Jagan: ప్రచారానికి జగన్ మళ్లీ బ్రేక్ ! వారంలో మూడోసారి- అసలు కారణమిదే..!
ఏపీలో వైసీపీ ప్రచారాన్ని అంతా తానై నడిపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇవాళ మరోసారి విరామం ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం దాదాపు పూర్తి కావొచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ ప్రచారం కంటే వ్యూహాలమీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో జగన్ ప్రచారానికి విరామం ప్రకటించడం ఇది మూడోసారి. ఇప్పటికే వ్యూహాలతో పాటు జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో బిజీగా ఉండటంతో మూడోసారి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఈ నెల 11వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. అయితే జగన్ మాత్రం మరో రెండు రోజుల్లోనే తన ప్రచారం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికే పలు విడతలుగా రాష్ట్రంలో ప్రచారం పూర్తి చేసిన జగన్.. ఇక చాలనే ఉద్దేశానికి వచ్చేశారు. దీనికి బదులు చివరి నిమిషంలో పోల్ మేనేజ్ మెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నేతలతో కీలక చర్చలు నిర్వహిస్తున్నారు.
అలాగే క్షేత్రస్ధాయిలో బూత్ లెవల్ లో పోల్ మేనేజ్ మెంట్ పై నేతలతో జగన్ వరుసగా చర్చలు జరుపుతున్నారు. దీంతో పాటు నేతలకు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదంటూ స్వయంగా జగనే చెప్పేయడంతో నేతలు కూడా కాస్త ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ చేసే సూచనలు కీలకంగా మారాయి. ముఖ్యంగా పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారిస్తున్నారు.












Click it and Unblock the Notifications