అత్యవసర భేటీకి జగన్ పిలుపు: స్పీడప్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమౌతున్నారు. వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తోన్నారు.
ఇటీవలే పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు జగన్. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం, అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, శాంతిభద్రతలు, పార్టీ కార్యకర్తలపై దాడులు- అరెస్టులు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు అప్పట్లో. పార్టీ వ్యూహరచన, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు జగన్.

ఇప్పుడు మరోసారి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 7వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారని తెలిపాయి.
ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. నూతన జంటను ఆశీర్వదించనున్నారు. అనంతరం 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి చంద్రబాబు సర్కార్ సాగిస్తోన్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో భాగంగా ఈ భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు.
కనీస మద్దతు ధర కోసం రాష్ట్రంలో రైతులు నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెర తీసింది. దీనికి నిరసనగా ఇప్పటికే ఛలో మెడికల్ కాలేజీల ఆందోళనను నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. అటు నిరుద్యోగ భృతి కోసం యువత పట్టుబట్టుతోంది. ఈ పరిస్థితుల మధ్య జగన్ కీలక భేటీని నిర్వహించబోతోన్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యూహరచన, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications