మేనిఫెస్టోతో జగన్ సిద్దం, కీలక హామీలు - గేమ్ ఛేంజర్..!!
ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా సాగుతోంది. నామినేషన్ల దాఖలు సమయంలోనే అభ్యర్దులు తమ బలం చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రేపు (23న) పవన్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. 25న జగన్ పులివెందులలో నామినేషన్ కు నిర్ణయించారు. ఇక..టీడీపీలో తాజాగా కొందరు అభ్యర్దులను మార్పు చేసారు. మేనిఫెస్టోలపై కూటమి కసరత్తు చేస్తోంది. సీఎం జగన్ ఈ నెల 26న వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
మేనిఫెస్టో పై కసరత్తు
ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు నిర్ణయించారు. ఇందుకు ఈ నెల 26వ తేదీ ముహూర్తంగా ఖరారు చేసారు. అందులో భాగంగా ఈ రోజు పార్టీ ముఖ్యులతో జగన్ విశాఖలో సమావేశం అవుతున్నారు. తన యాత్రలో ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను వివరించి..మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. ఈ నెల 25న పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజు అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. ఆ సభ ద్వారా ఎన్నికల ప్రచార రెండో దశ ప్రారంభించనున్నారు. రోజు మూడు సభల్లో పాల్గనేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వంద సభల్లో జగన్ పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖలో జగన్ యాత్రకు వచ్చిన స్పందనపై పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

పార్టీ నేతలతో భేటీ
మేనిఫెస్టోలో ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే జగన్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమ్మఒడి పరిధి పెంపు, పెన్షన్లు రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. రైతు రుణమాఫీ కోసం జగన్ పైన పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసామని జగన్ ప్రతీ సభలో చెబుతున్నారు. చెసేదే చెబుతామని..చెబితే చేస్తామని జగన్ స్పష్టం చేసారు. గత ఎన్నికల సమయంలో చెప్పిన డ్వాక్రా సంఘాల రుణ మాఫీ అమలు చేసారు. దీంతో..ఈ సారి రైతులు, మహిళల కోసం జగన్ ఏం ప్రకటిస్తారనేది కీలకంగా మారుతోంది. బస్సు యాత్రలో భాగంగా జగన్ వివిధ వర్గాలతో సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశాల్లో ఒక బాక్స్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించారు.
రుణమాఫీ ఉండేనా
జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తారా...రైతు భరోసా మరింత పెంచుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మహిళల కోసం కొత్త నిర్ణయాలు పార్టీ మేనిఫెస్టోలో ఉంటాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్ రైతు రుణమాఫీకి అనుకూలంగా నిర్ణయం ఉంటుందనే అంచనాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. దీంతో, రుణమాఫీ పైన జగన్ ప్రకటన చేస్తే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. మరిన్ని హామీలతో మేనిఫెస్టో ప్రకటనకు మూడు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తే మరింత మెరుగైన హామీ లతో ముందుకు వెళ్లాలనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications