మోరంపూడి ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
తూర్పుగోదావరి: రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ వద్ద స్కూల్ బస్సు ప్రమాద ఘటనలో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. దుర్గాప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
ప్రమాద ఘటన జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

గత ఆదివారం స్కూల్ బస్సు మోరంపూడి జంక్షన్ వద్ద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేమగిరి వైపు వెళ్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి ఓ కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. అనంతరం హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన దుర్గాప్రసాద్(13), రాజమండ్రి గాంధీపురానికి చెందిన వెంకన్న(55) అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి(70) ఆస్పత్రి తరలిస్తుండగా మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications