YS Jagan vs YS Sharmila: ఎన్నికల వేళ విదేశాలకు విజయమ్మ.. మతలబు ఇదే!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి విజయమ్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో విజయమ్మ అమెరికా వెళ్లడం పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్నికలు అయిపోయే వరకు విజయమ్మ మళ్ళీ తిరిగి రాదని అన్నాచెల్లెళ్ల మధ్య పోరుతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతుంది.
వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల.. దిక్కుతోచని స్థితిలో విజయమ్మ
ఏపీలో అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ నేపథ్యంలో ఎవరికి చెప్పలేక, ఎవరి పక్కన నిలబడలేక వైయస్ విజయమ్మ అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు. కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కూతురు వైయస్ షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారడంతో ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు విజయమ్మ.

ఇద్దరిపైనా తల్లి విజయమ్మ ప్రేమ .. అందుకే
కొడుకు పైన, కూతురు పైన ఆమెకు ఉన్న ప్రేమ ఇద్దరి మాటను కాదనలేని పరిస్థితికి కారణంగా మారుతుంది. ఇందులో భాగంగానే కొడుకు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుంటే ఆశీర్వదించి పంపింది. మార్చి 27వతారీకు జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంది. కూతురు ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే కూడా దీవించి పంపింది. కూతురు బస్సుయాత్రకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేసి దీవించి పంపింది.
షర్మిల ఏపీ రాజకీయాలతో విజయమ్మకు ఇబ్బంది
ఒకరి మీద ఒకరు కత్తులు నూరుతున్న కొడుకు, కూతురు ఆమె మాట వినేస్థాయి దాటిపోవడంతో ఎన్నికల సమయంలో ఏం చేయాలో అర్థం కాని విజయమ్మ అమెరికాకు వెళ్ళిపోయింది. ఎవరికీ తన మద్దతును ప్రకటించలేని పరిస్థితిలో ఓ తల్లిగా ఆమె ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకొని అమెరికా వెళ్లిపోయింది. వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేసినప్పుడు కలగని ఇబ్బంది, ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజకీయాలు చేయడానికి వచ్చినప్పుడు విజయమ్మకు కలిగింది.
ఆమె అమెరికా వెళ్ళటం వెనుక కారణం ఇదే
కూతురు తలపడుతుంది కొడుకుతో అని అర్థం చేసుకున్న విజయమ్మ ఇద్దరికీ నచ్చ చెప్పలేక, ఏం చేయాలో అర్థం కాక మధ్యే మార్గంగా అమెరికాకు వెళ్లినట్టు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇద్దరికీ మద్దతు ఇవ్వలేక, ఎవరైనా ఒకరికి మద్దతు ఇస్తే, వేరొకరితో ఇబ్బంది వస్తుందని భావించి చల్లగా ఇక్కడి నుంచి జారుకుంది.
తెలివైన నిర్ణయం తీసుకున్న విజయమ్మ
ఏది ఏమైనా తాజా పరిస్థితులలో వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో విజయమ్మ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications