జగన్ సభలో ఎమ్మెల్యే రాచమల్లు ఆసక్తికర వ్యాఖ్యలు
YS Jagan Bus Yatra: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగుస్తుంది.
ఇడుపులపాయలో బస్సు యాత్రను ప్రారంభించిన అనంతరం కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు జగన్. అక్కడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మార్గమధ్యలో వేలాది మందిని పలకరిస్తూ రావడం వల్ల అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైందీ సభ.

ఈ సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ప్రజలను తన కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు. జిల్లా ప్రజలు ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనూ తనకు ఈ జిల్లా అండగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సత్సంకల్పంతో చేపట్టిన బస్సు యాత్రకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టానని జగన్ అన్నారు.
ఇదే సభలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. వైఎస్ జగన్.. జూన్ 4వ తేదీన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్‌సభ స్థానాన్ని ఫ్యాన్ గాలి స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వివిధ సంక్షేమ పథకాల కింద ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 1,700 కోట్ల రూపాయలను మంజూరు చేశారని, అలాగే 1,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. 24,000 మందికి ఇళ్ల పట్టాల జగన్ ప్రభుత్వం ఇచ్చిందని, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిందని చెప్పారు.
ఇలాంటి నియోజకవర్గాలు 175 ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. అన్ని స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచి తీరుతారని జోస్యం చెప్పారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మరింత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన జగన్‌కు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications