వైఎస్ జగన్ జిల్లా పర్యటన
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సమీపించింది. సెప్టెంబర్ 2న కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో కుప్పకూలింది. ఆయన ఇక లేరనే వార్త తెలిసిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. శోకసంద్రంగా మారింది.
తండ్రి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్తారు. భాకరాపురం చేరుకుంటారు. అక్కడి క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 2వ తేదీ ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారు వైఎస్ జగన్. అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. తండ్రికి నివాళులర్పిస్తారు. అనంతరం లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం పులివెందులకు చేరుకుంటారు క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 3వ తేదీన ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు శనివారం వైయస్ఆర్‌సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఉమ్మడి కడప జిల్లాకు చెందిన పార్టీ నాయకులు ఆయన వెంట ఉంటారు.












Click it and Unblock the Notifications