వాళ్లిద్దరినీ అరెస్టు చేయాల్సిందే-వైఎస్ షర్మిల తాజా డిమాండ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు ఘటనలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా పోస్టులతో రెచ్చిపోయిన ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తోంది. అయితే ఇందులో కొందరిని మాత్రం చూసీ చూడనట్లుగా వదిలేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి వారికి అనుచిత పోస్టులకు కారణమైన వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి వంటి వారి పేర్లు ముందు వరుసలో ఉన్నాయి.
సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు తన తల్లి విజయమ్మ, సోదరి సునీతపై పోస్టులు పెట్టించిన వ్యవహారంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు నిర్దారణకు వచ్చినా ఇప్పటివరకూ వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ప్రశ్నించారు. వైసీపీ సైకో వర్రా రవీందర్ రెడ్డితో తమపై పోస్టులు పెట్టించిన అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి విచారించాలని షర్మిల డిమాండ్ చేశారు. అలాగే ఈ పోస్టులకు కారణమైన సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలన్నారు.

సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇప్పటికే వైఎస్ షర్మిల స్వాగతించారు. గతంలో తమపై పోస్టులు పెట్టిన వారందరినీ శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చిన్న చేపల్ని పట్టుకుని పెద్ద చేపల్ని వదిలేస్తుందన్న భావనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె ఇవాళ కోరారు.












Click it and Unblock the Notifications