షర్మిల అనుమానం కూడా అదే..
YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. మరో పథకానికి మంగళం పాడిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ కార్డును అందరూ తీసుకునేలా చర్యలు చేపడతామంటూ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ భారత్‌ను వినియోగించుకోవచ్చని, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైనన్ని డబ్బులు లేవని పెమ్మసాని తేల్చి చెప్పారు. ఈ పథకం కింద ఆసుపత్రులకు బిల్లులు కూడా రావట్లేదని స్పష్టం చేశారు. రోగులకు ట్రీట్‌మెంట్ కూడా జరగట్లేదని అన్నారు.
పెమ్మసాని చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఆరోగ్యశ్రీ టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యల వల్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా అని ప్రశ్నించారు.
ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా? అంటూ చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన కూటమి సర్కార్ ఉందా?,అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా?, పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తోన్నారంటూ షర్మిల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే అయిదు లక్షల రూపాయలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా? అంటూ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్పినట్టయిందని ఆరోపించారు షర్మిల. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయల బకాయిలను పెట్టిందని, దీనివల్ల ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ఆసుపత్రులు ముందుకు రావట్లేదని అన్నారు.
ఇప్పుడు టీడీపీ కేంద్రమంత్రి మాటలు.. ఈ పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయని షర్మిల ధ్వజమెత్తారు. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అద్భుత పథకమని, పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకంగా అభివర్ణించారు.
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌కు కూడా ఆరోగ్యశ్రీనే ఆదర్శమని, అలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించబోమని షర్మిల హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 1,600 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications