అన్న బాధ్యత: ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
కర్నూలు: ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. కర్నూలులో నిర్వహించిన న్యాయయాత్ర సందర్భంగా ఆమె మాట్లాడారు. కర్నూలుకు న్యాయరాజధాని అంటూ జగన్ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
తన అఫిడవిట్ లో పేర్కొన్న అప్పుల అంశంపై షర్మిల వివరణ ఇచ్చారు. నిజానికి చెల్లికి ఏ అన్న అయినా ఆస్తిలో వాటా ఇవ్వాలి.. ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉందన్నారు. మేనమామగా కూడా అన్నకు బాధ్యత ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. కొందరు చెల్లికివ్వాల్సిన వాటాను కూడా తమదిగా భావిస్తారని జగన్‌ను పరోక్షంగా విమర్శించారు. చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తనకు ఎలాంటి ఆస్తులు పంచారనేది కుటుంబం మొత్తానికి, దేవుడికీ తెలుసని షర్మిల వ్యాఖ్యానించారు. తమ పోరాటం ఆస్తుల కోసం కాదు, న్యాయం కోసమని షర్మిల స్పష్టం చేశారు. రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదంటూ ఆందోళన వ్యక్తి చేసిన షర్మిల.. న్యాయం మొండిగా కోసం పోరాటం చేస్తున్నామన్నారు వైఎస్ షర్మిల.
మరోవైపు,కర్నూలు న్యాయ రాజధాని పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారని, కనీసం మంచినీళ్లు కూడా లేకుండా చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని షర్మిల ప్రశ్నించారు. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు.
ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారని, ఏదీ ఎక్కడ కనపడదే అంటూ షర్మల ఎద్దేవా చేశారు. ఆర్టీసీ, విద్యుత్‌తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచారన్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమంటూ బయల్దేరారని విమర్శించారు. ప్రత్యేక హోదా అని మోసం చేసినందుకు సిద్ధమా?, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధమంటున్నారని జగన్ సర్కారుపై షర్మిల విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications