ఇడుపులపాయకు షర్మిల - రాజకీయ ప్రకటన, నేరుగా పాలేరుకు..!?
వైఎస్ షర్మిల ఇడుపుపాయకు వస్తున్నారు.ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతీ ఏటా వైఎస్సార్ జన్మదినం..వర్దంతి నాడు కుటుంబ సభ్యులు నివాళి అర్పిస్తారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం నడుమ వైఎస్ జన్మదినం నాడు ప్రకటన ఉంటుందని భావించారు. ఇప్పుడు షర్మిల ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఇడుపుల పాయకు షర్మిల : వైఎస్ షర్మిల ఈ సాయంత్రం ఇడుపుల పాయకు చేరుకోనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం ఇడుపులపాయకు వస్తారు. రేపు (శనివారం) వైఎస్సార్ ఘాట్ లో షర్మిల తన తండ్రికి నివాళి అర్పిస్తారు. ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. 10. 45 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఖమ్మం జిల్లా పాలేరుకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు షర్మిల ప్రకటించారు.

నేరుగా పాలేరుకు ప్రయాణం : కొంత కాలంగా షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యాయి. కాంగ్రెస్ లో చేరటం లాంఛనంగానే కనిపిస్తోంది. ఇడుపుల పాయలోనే షర్మిల తన తండ్రి జన్మదినం నాడు తన రాజకీయ ప్రకటన చేస్తారనే అంచనాలు ఉన్నాయి. అక్కడ ప్రకటన చేసిన తరువాత తాను పోటీ చేయనున్న పాలేరులో పర్యటనకు వెళ్తారని భావిస్తున్నారు. పాలేరు లో దాదాపు గంటన్నార సేపు షర్మిల తన మద్దతు దారులతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ నుంచి షర్మిల పాలేరు అభ్యర్ధిగా బరిలో నిలవటం ఖాయంగా కనిపిస్తోంది.

రాజకీయ ప్రకటన చేస్తారా : ఇప్పుడు షర్మిల ఇడుపులపాయ..పాలేరు పర్యటన లో ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. తన పార్టీని కాంగ్రెస్ తో పొత్తుకే పరిమితం చేస్తారా..విలీనానికి అంగీకరిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది, షర్మిల సేవలను కాంగ్రెస్ ఏపీలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు షర్మిల సిద్దంగా లేరు. తెలంగాణకే పరిమితం అవుతానని తేల్చి చెప్పారు. ఈ సమయంలో షర్మిల అటు ఇడుపుల పాయ..ఇటు పాలేరు పర్యటన వేళ రాజకీయంగా ఏం ప్రకటన చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications