ప్రజల్లోకి షర్మిల - ఆ జిల్లాలపైనే ఫోకస్, తొలి రోజే బల ప్రదర్శన..!!
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ ముహూర్తం ఖరారైంది. తొలి నిమిషం నుంచే దూకుడుగా వ్యవహరించాలని షర్మిల నిర్ణయించారు. ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం భారీ టాస్క్ ఫిక్స్ చేసింది. షర్మిల బాధ్యతల స్వీకరణ వేళ పార్టీ నాయకత్వం తరలి వస్తోంది. పీసీసీ చీఫ్ గా ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని షర్మిల డిసైడ్ అయ్యారు. అదే సమయంలో తన లక్ష్యం ఏంటో నిర్ణయించుకున్న షర్మిల వ్యూహాత్మకంగా అడుగులకు సిద్దమయ్యారు.
Recommended Video

షర్మిల బాధ్యతలు: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఎలాంటి ప్రభావం చూపిస్తారనే చర్చ మొదలైంది. ఈ నెల 21న షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుంది. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి చెంత ఆమె పీసీసీ పగ్గాలు చేపడతారని సమాచారం. వైఎస్ అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ఆమెకు మద్దతు పలుకనున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. బాధ్యతల స్వీకరణ సమయంలోనే ఇడుపులపాయ వేదికగా రాజకీయంగా షర్మిల బల ప్రదర్శనకు సిద్దమవుతున్నారు. భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రమాణ స్వీకార వేళ తరలి వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ప్రజల్లోనే ఉండేలా: ఈ రోజు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధం హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు సీఎం జగన్ హాజరవుతున్నారు. రేపు (శుక్రవారం) షర్మిల రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, తన తండ్రి అనుచరులతో సమావేశమవుతారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ తర్వాత ఆమె తన కార్యాచరణ ప్రకటించి నేరుగా ప్రజల్లోకి వెళ్తారని తెలుస్తోంది.
బస్సు యాత్ర చేస్తారని చెబుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం సహా అన్ని విభజన హామీల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని సమాచారం. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీతో కలవటం పైన ప్రధానంగా ప్రస్తావన ఉంటుందని.. మూడు పార్టీలను లక్ష్యంగా చేసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎవరికి నష్టం: షర్మిలను ప్రధానంగా రాయలసీమ, గోదావరి జిల్లాల్లో ఫోకస్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. షర్మిల ద్వారా కాంగ్రెస్ తిరిగి ఏపీలో బలం పెంచుకుంటుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇదే సమయంలో షర్మిలకు పగ్గాలు అప్పగించటం పైన సీనియర్ నేత హర్ష కుమార్ లాంటి వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
షర్మిల ఎంట్రీతో జగన్ ఓట్ బ్యాంక్ చీలుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, జగన్ వ్యతిరేక ఓటు మాత్రమే షర్మిలకు కొంత మేర వెళ్లే అవకాశం ఉందని..దీని ద్వారా టీడీపీ-జనసేనకు పడాల్సిన ఓటులో చీలక వస్తుందనే వాదన ఉంది. దీంతో, అసలు షర్మిల ప్రజల మధ్యకు వచ్చిన సమయంలో ఎలాంటి స్పందన ఉంటుంది..ఎవరి ఓటును చీల్చుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications