శోభ స్థానం: అళ్లగడ్డ ఉప ఎన్నికల్లో విజయమ్మ పోటీ?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఉప ఎన్నికలలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు కొట్టి పారేయలేమంటున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు ఇప్పటికే ఈ ప్రతిపాదనలు వస్తున్నాయట.
వైయస్ విజయమ్మను ఆళ్లగడ్డ నుండి పోటీ చేయించాలని వైయస్ జగన్‌కు పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్నారట. కర్నూలు ఆళ్లగడ్డ నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి శోభా నాగిరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఎన్నికలకు ముందే ఆమె ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పోటీ చేసి గెలుపొందిన ఆళ్లగడ్డ నుండి విజయమ్మను నిలబెడతామని జగన్ వద్ద పలువురు నేతలు సూచిస్తున్నారట. దీనిపై ఇంకా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం పులివెందుల నుండి గెలుపొందిన విజయమ్మ.. ఇటీవల ఎన్నికల్లో తన స్థానంలో జగన్ పోటీ చేయడంతో విశాఖ నుండి లోకసభ బరిలో నిలిచారు. అయితే బిజెపికి చెందిన కంభంపాటి హరిబాబు చేతిలో ఆమె పరాజయం చవి చూశారు. దీంతో ఖాళీ అయిన శోభా నాగిరెడ్డి స్థానం నుండి ఆమెను బరిలోకి దింపాలనే డిమాండ్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications