నేరుగా ఎదుర్కోండి: జగన్‌తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన విజయమ్మ
YS Vijayamma: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ వ్యవహారం మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. అటు వైఎస్ జగన్, ఆయన చెల్లెలు, ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య లేఖల యుద్ధం నడిచింది.
అదే సమయంలో వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఘటన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. దీనిపై స్వయంగా వైఎస్ విజయమ్మ స్పందించాల్సి వచ్చింది.
గతంలో ఎప్పుడో కర్నూలు సమీపంలో జరిగిన తన కారు ప్రమాదాన్ని తాజాగా సంభవించినట్లు చిత్రీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఈ ప్రమాదానికి జగన్ కారణం అన్నట్లుగా దుష్ఫ్రచారం చేస్తోన్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోననీ హెచ్చరించారు.

ఇప్పుడు తాజాగా ఆమె మరోసారి ఈ విషయంపై స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తనను ఆవేదనకు గురి చేస్తోందని అన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వాడికి అంతా పచ్చగానే కనిపిస్తోందనిపించేలా ఈ ప్రచారం సాగుతోందని అన్నారు.
రెండు సంవత్సరాల కిందట జరిగిన కారు ప్రమాదాన్ని తన కుమారుడికి ముడిపెట్టి కథ అల్లుతున్నారంటూ వైఎస్ విజయమ్మ విమర్శించారు. మనవడి దగ్గరికి వెళ్తే దానికీ మరో కథను జోడిస్తోన్నారని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల అసలు తన కూతురే కాదనే ప్రచారానికీ ఒడిగట్టారని ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారాలా?, ఇంత నీతిమాలిన, సిగ్గుమాలిన మాటలు, కథలు అల్లాలా?, ఒకరి వ్యక్తిత్వాన్ని ఇంతగా హననం చేయాలా? అంటూ విజయమ్మ ప్రశ్నించారు. ఇదంతా తనకు, తన కుటుంబానికి ఎంతగానో బాధాకరంగా, అవమానకరంగా అనిపిస్తోందని పేర్కొన్నారు.
కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రానా ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? కొడుక్కు అమ్మకాకుండా పోతుందా? ఓ అన్నకు చెల్లి కాకుండా పోతుందా? చెల్లికి అన్న కాకుండా పోతాడా? అని నిలదీశారు. తన పిల్లలిద్దరినీ సంస్కారవంతంగా పెంచానని, వాళ్ల మధ్య తలెత్తిన ఈ విభేదాల్లో హుందాతనంగా రాజకీయాలు చేయాలని కోరారు.
తన కొడుకును నేరుగా ఎదుర్కొనాలని, ఏదిపడితే అది మాట్లాడొద్దని, ఏది రాయాలనిపిస్తే అది రాయొద్దని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య రాసిన రెండు లెటర్లూ తనవేనని, ఫేక్ లెటర్లను రాయాల్సిన అవసరం తన కొడుక్కు లేదని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ విజయమ్మ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications