67సీట్లు తక్కువేం కాదు: అంతర్మథనం, జగన్ మారాలా
హైదరాబాద్: సీమాంధ్రలో ఘోర పరాజయం, స్వయంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖ లోకసభ నుండి పోటీ చేసి ఓడిపోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆంతర్మథనం చెందుతోంది. జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ భావించింది. కానీ బాక్సాఫీసు వద్ద ఫెయిలైన సినిమాలా ఆ పార్టీ తీరు తయారైంది. పోలింగ్ రోజు కూడా షర్మిల తమ పార్టీకి 150 సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు.
నరేంద్ర మోడీ హవా బలంగా ఉన్నా, పవన్ ప్రచారం చేసినా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ఓటర్లు మోకాలడ్డినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 67 అసెంబ్లీ సీట్లు, 8 లోకసభ సీట్లు రావడం ఆషామాషీ కాదనే చెప్పవచ్చు. సీమాంధ్ర కొత్త అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా అవతరించిన జగన్ పార్టీని బలోపేతమైన శక్తిగా రూపొందించాలంటే, జగన్ వైఖరిని మార్చుకోవాలని పార్టీ వర్గాలే అంటున్నాయట.

కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఫల్యానికి అనేక కారణాలున్నాయి. ఒక్క జాతీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోక పోవడం, అతివిశ్వాసానికి పోవడం, పదే పదే చంద్రబాబునే లక్ష్యంగా చేసుకోవడం, పవన్, మోడీల ప్రచారం తదితర అంశాలు ఆ పార్టీని దెబ్బతీశాయంటున్నారు.
జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఎంతసేపు కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. ఇది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్ధితే. అధికారం కోసం కుటుంబం ఇంత వెంపర్లాడడమేంటనే వాదన జనంలోకి వెళ్లింది. చంద్రబాబు పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి పదేళ్ల పాటు అధికారానికి దూరమైనా కుటుంబ సభ్యులతో ఇలా ప్రచారం చేయలేదంటున్నారు.
ఉభయ కమ్యూనిస్టులు లేదా బిఎస్పీ లాంటి పార్టీనైనా రంగంలోకి దించి కొన్ని సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుని ఉంటే కొద్దిగా కలిసి వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. టిడిపి ఆరోపణలకు ఎన్నికల్లో కౌంటర్ ఇచ్చే ఇతర పార్టీల నేతలు కరువయ్యారంటున్నారు. విభజనకు తాను కూడా అనుకూలంగా లేఖ ఇచ్చిన జగన్, లేఖ వెనక్కు తీసుకోలేదని బాబును విమర్శించడంపై కూడా ప్రజల్లో స్పందన లేదంటున్నారు.
బాబు అధికారానికి దూరమై పదేళ్లయితే, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న స్ధితికి కాంగ్రెస్ కారణమైతే, బాబును ఇష్టం వచ్చినట్లు తూలనాడడం కూడా ఓటర్లు ఆ పార్టీ పట్ల విముఖత చెందేందుకు కారణమంటున్నారు. పైగా చంద్రబాబు పరిపాలనా అనుభవాన్ని రాజకీయానుభవం, పరిపాలనలో అనుభవం లేని, చట్టసభలకు ఇంతవరకు ఎన్నిక కాని షర్మిల, మొదటిసారి ఎంపి అయిన జగన్, మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన విజయమ్మ విమర్శించడం కూడా ప్రజలు ఆ పార్టీకి దూరం కావడానికి కారణమంటున్నారు.
రాజకీయంగా చైతన్యం ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో సంక్షేమం కంటే అభివృద్ధికి ప్రాధాన్యతకు ఇస్తారు. ఆ జిల్లావాసుల మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా జగన్ పార్టీ నేతల ప్రసంగాలు లేవని చెబుతున్నారు.
విజయమ్మను విశాఖపట్నం లోకసభకు నిలబెట్టడం వ్యూహాత్మక తప్పిదమేనంటున్నారు. జగన్ కూడా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలుపుగోలుగా ఉంటూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తే వైయస్‌ను మించిన నేతగా ఎదిగే అవకాశముందని కాని, వ్యవహారశైలిలో మార్పురాని పక్షంలో రానున్న రోజుల్లో అసెంబ్లీ లోపల, వెలుపల జరిగే రాజకీయ ఎత్తుగడల్లో ఆ పార్టీకి చేదు ఫలితాలను తప్పక పోవచ్చునంటున్నారు. గతంలో పలుమార్లు అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది.












Click it and Unblock the Notifications