సీబీఐ కోర్టుకు జగన్, త్వరలో విచారణ ప్రారంభం
హైదరాబాద్: ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాంపల్లి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. పది చార్జిషీట్లలో ఉన్న నిందితులు కోర్టుకు హాజరయ్యారు. కేసును కోర్టు వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, వైయస్ జగన్ గత నెల సిబిఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆస్తుల కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు కేసును జూలై 21వ తేదీకి వాయిదా వేసింది. గత నెల హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టు ఎదుట జగన్‌తో పాటు తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు సబితా, ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ, ఆడిటర్ విజయ సాయి రెడ్డిలు హాజరయ్యారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పైన సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సిబిఐ పది ఛార్జీషీట్లను కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జగన్, మాజీ మంత్రులు పలుమార్లు కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్ కోర్టుకు వచ్చిన నేపథ్యంలో ఆయనను కలుసుకునేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
ఓఎంసీ కేసు వాయిదా
ఓఎంసీ కేసు వచ్చే నెల 11వ తేదీకి వాయిదా పడింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుతో పాటు ఓఎంసీ తదితర కేసులను సీబీఐ దర్యాఫ్తు చేస్తోంది. ఓఎంసీ కేసును కోర్టు ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications