ఖేల్ ఖతం.. దుకాణం బంద్
ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు సోషల్ మీడియా విభాగాలున్నాయి. ప్రతి పార్టీకి అనుబంధ విభాగాలున్నట్లుగానే సోషల్ మీడియా విభాగాలు కూడా ఏర్పడ్డాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం మధ్య ప్రత్యక్షంగా జరిగే యుద్ధంకన్నా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా జరిగే యుద్ధమే ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లుండటంతో సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకొని ఈ రెండు పార్టీలు పోరాడేవి. ఈ పోరాటంలో దాదాపుగా వైసీపీనే పైచేయి సాధించింది.
తాత్కాలికంగా బంద్?
వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం తన ప్రభావాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో బలంగా చాటింది. విజయసాయిరెడ్డి దగ్గర ఉన్న ఈ విభాగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి అప్పగించారు. సోషల్ మీడియాను ప్రభావితం చేసే ఛానళ్లు, వ్యక్తులు కూడా వైసీపీ గూటికి చేరారు. దీనికోసం ఆ పార్టీ భారీగా ఖర్చుపెట్టింది. ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు ఐప్యాక్ టీం సేవలు షరామాములే. అయితే ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని తాత్కాలికంగా బంద్ చేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ఫలితాల వరకు సెలవులు
పోలింగ్ ముగిసిన తర్వాత ఐప్యాక్ సేవలు చాలని చెప్పినట్లు తెలుస్తోంది. రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐప్యాక్ ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీకి సేవలందించింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. అలాగే సోషల్ మీడియా విభాగంలో 150 మంది పనిచేస్తుంటారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు వీరికి సెలవు ప్రకటించారు. ఫలితాలు అనుకూలంగా వస్తే వీరి ఉద్యోగాలు కొనసాగుతాయి. ప్రతికూలంగా వస్తే అంతే సంగతలు.
భయపడుతున్న ఉద్యోగులు
వైసీపీకి సేవలందిస్తున్న సోషల్ మీడియా విభాగానికి గత ఆరు నెలల నుంచి వేతనాలివ్వడంలేదని ఇద్దరు ఉద్యోగులు గతంలోనే ఆరోపణలు చేశారు. తర్వాత సోషల్ మీడియా విభాగాన్ని నిర్వహిస్తున్న భార్గవ్ రెడ్డిపై కేసు నమోదైంది. ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలించిన తర్వాత ఇందులో పనిచేసేందుకు వారంతా భయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం మారితే తమపై కూడా కేసులు నమోదవుతాయనే ఆందోళనలో ఉన్నారు. వేతనం ఇచ్చేస్తే వెంటనే బయటకు వెళ్లేందుకు వీరంతా సిద్ధపడుతున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications