టిడిపి భయం: గోవాకు జగన్ పార్టీ కార్పోరేటర్లు

తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని సంప్రదించకుండా ఉండేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు కార్పోరేటర్లకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు గోవా టికెట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పదవిని దక్కించుకునేందుకు తాము ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్పోరేటర్ల మద్దతు పొందామని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రకటనలను పట్టించుకోకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్, శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 30 మంది కార్పోరేటర్లను శుక్రవారం క్యాంప్‌నకు పంపించారు.
కాగా, ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా కార్పోరేటర్లను తెలుగుదేశం నాయకులు వారి భర్తల సహకారం ద్వారా తమవైపు తిప్పుకున్నట్లు చెబుతున్నారు. వారి సాయంతో మరింత మందిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, అనిల్ కుమార్ యాదవ్, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రంగంలోకి దిగడంతో వారి ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు చెబుతున్నారు.
నెల్లూరు నగర శాసనసభ్యుడు వెంటనే ఇద్దరు మహిళా కార్పోరేటర్ల ఇళ్లకు వెళ్లి టిడిపికి మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరు కూడా తమ భర్తలు, పిల్లలతో గోవాకు శుక్రవారం తరలివెళ్లినట్లు చెబుతున్నారు. కార్పోరేటర్లతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, పి. రూప్‌కుమార్ యాదవ్, అబ్దుల్ జలీల్ ఉన్నారు.
కార్పోరేటర్లను గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంచినట్లు తెలుస్తోంది. వారికి మహారాష్ట్రకు చెందిన సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications