కడప ఉప ఎన్నిక- తేల్చేసిన వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు- రేవంత్ కామెంట్స్ క్లారిటీ..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. దీనికి కారణం ఈ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. త్వరలో పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా బరిలోకి దిగుతారనే ప్రచారమే.
తొలుత కూటమి నేతలు మొదలుపెట్టిన ఈ ప్రచారం నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసే వరకూ వెళ్లింది. దీనిపై వైసీపీ ఇవాళ క్లారిటీ ఇచ్చింది.

నిన్న వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళగిరి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కడపలో త్వరలో ఉపఎన్నికలు రావొచ్చని తనకు సమాచారం ఉందన్నారు. అదే జరిగితే షర్మిలను గెలిపించుకునేందుకు తాను పూర్తిస్దాయిలో తిరుగుతానని హామీ ఇచ్చారు. దీనిపై ఇవాళ వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అన్నారు.
జగన్, అవినాష్ తమ పదవులకు రాజీనామా చేస్తారంటూ దుష్ప్రచారం చేయడం దారుణమని సురేశ్ బాబు తెలిపారు. అధికార కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల్ని ప్రజలు నమ్మారని, వీటితో పాటు తమ సంక్షేమ పథకాలు కొనసాగాలని తాము కోరుకున్నామని ఆయన తెలిపారు. కేవలం పట్టుమని 24 రోజులు కాకముందే జగన్ పార్లమెంట్ కు వెళ్తున్నారని, అవినాష్ రాజీనామా చేస్తున్నారని ఓ పత్రికలో రాయడం, దాన్ని పట్టుకుని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. కడపలో ఎదురైన ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినట్లుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తాము ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications