వైసీపీ అయిదో లిస్ట్: పోటీకి ధర్మాన దూరం: ఒప్పుకోని జగన్
Dharmana Prasada Rao: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే కొన్ని లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. నాలుగు విడతల్లో జాబితాలు వెలువడ్డాయి. అయిదో లిస్ట్‌పై కసరత్తు పూర్తయింది. నేడో రేపో.. ఈ జాబితా వెలువడొచ్చు.
ఈ పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలన కోసం తీసుకోవద్దని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. తన నిర్ణయాన్ని వైఎస్ జగన్ దృష్టికీ తీసుకెళ్లానని పేర్కొన్నారు. యువనేతగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, 33 సంవత్సరాలకే మంత్రిని అయ్యానని అన్నారు. సుదీర్ఘకాలం కొనసాగుతున్నానని గుర్తు చేశారు.
అందుకే కాస్త ముందుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నానని ధర్మాన అన్నారు. తన నియోజకవర్గంలో పార్టీ నిలబెట్టే అభ్యర్థి విజయానికి కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలనేది తమ అభిమతమని వివరించారు.
తన నిర్ణయాన్ని వైఎస్ జగన్‌కు వివరించాననీ అన్నారు. దీనికి జగన్ సానుకూలంగా లేరని, తాను విశ్రాంతి తీసుకుంటానంటే ఒప్పుకోవట్లేదని ధర్మాన చెప్పారు. ఈ ఒక్కసారి పోటీ చేయాలని, విశ్రాంతి గురించి ఆ తరువాతి ఎన్నికల నాటికి చూద్దామని జగన్ కోరారని అన్నారు. ఈ విషయంలో ప్రజలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications