మచిలీపట్నం లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా..
YSRCP Machilipatnam MP candidate: కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబు పేరు దాదాపు ఖరారైనట్టే. నేడో, రేపో విడుదల అయ్యే అయిదో జాబితాలో ఆయన పేరు ఉండొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గం పరిధిలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా నివేదికలు అందడంతో వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరొచ్చని తెలుస్తోంది.

వల్లభనేని బాలశౌరి స్థానంలో సింహాద్రి రమేష్ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జిల్లాలోని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి ఎన్నికల్లో 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ను ఓడించారు.
జిల్లాలో బలమైన నాయకుడిగా పేరుండటం వల్ల ఆయనను మచిలీపట్నం నుంచి లోక్‌సభ పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం భావించింది. దీనికి అనుగుణంగా ఆయన పేరును ఖరారు చేసిందని, త్వరలో వెలువడే అయిదో జాబితాలో ఆయన పేరు ఉంటుందని చెబుతున్నారు.

ఇదే విషయాన్ని సింహాద్రి రమేష్ బాబు ధృవీకరించారు. అవనిగడ్డలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడికి వెళ్లడానికి తాను రెడీగా ఉన్నానని అన్నారు. ఆయన మాటే తనకు శిరోధార్యమని, జగన్ గీసిన గీతను దాటబోననీ తేల్చి చెప్పారు. చివరి వరకూ జగన్ వెంటే ఉంటాననీ వివరించారు.












Click it and Unblock the Notifications