అచ్యుతాపురం సెజ్ మృతులకు వైసీపీ 5 లక్షల సాయం-కూటమిపై బొత్స ఫైర్
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఉన్న ఎసెన్షియా ఫార్మాలో రియాక్టర్ పేలి 17 మంది చనిపోయిన ఘటనలో మృతుల కుటుంబాలతో పాటు బాధితులకు పార్టీ తరఫున సాయం చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇవాళ సాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున, బాధితులకు లక్ష చొప్పున సాయం అందించనున్నట్లు బొత్స వెల్లడించారు.
మరోవైపు ఎసెన్షియా ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల చొప్పున సాయం అందించకపోతే ధర్నాకు దిగుతామనంటూ వైఎస్ జగన్ చేసిన హెచ్చరికపై కూటమి నేతలు విమర్శలకు దిగడాన్ని బొత్స తప్పుబట్టారు. ప్రకటించిన సాయం ఇవ్వకపోతే ధర్నా చేస్తామనడాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. ఈ విషయంలో కూటమి నేతలు ఎదురుదాడి చేయడం సరికాదన్నారు.

బ్లాస్ట్ ఘటన తర్వాత సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న మండలి విపక్షనేత, మంత్రులెవరూ సక్రమంగా స్పందించలేదని వెల్లడించారు. పరిశ్రమల్లో రక్షణ చర్యల్లోనూ అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆయన, ఎంతసేపూ గత తమ ప్రభుత్వంపై నిందలు మోపడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని ఆక్షేపించారు.ఎక్కడైనా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, అక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు, వెంటనే ఏమేం చేశారు?. బాధితులను ఎలా ఆదుకున్నారు?. భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటారో చెబుతారని బొత్స గుర్తు చేశారు. కానీ, ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు, అసలు విషయాన్ని పక్కనపెట్టి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications