వైసీపీ సంచలన నిర్ణయం-ఈవీఎంల చెకింగ్ కు దరఖాస్తు-ఎక్కడెక్కడంటే..?
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి ఘన విజయం సాధిస్తే.. అధికారంలో ఉన్న వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. ఏదో జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే ఆధారాలు లేకుండా ఏమీ చేయలేమంటూ నిర్వేదం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఎక్స్ లో పోస్టు పెట్టిన వైఎస్ జగన్.. ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో భేటీలోనూ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎన్నికల సంఘానికి ఈవీఎంలను ర్యాండమ్ గా పరిశీలించేందుకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని నిబంధనల ప్రకారం ఈసీని కోరినట్లు సమాచారం.

జాతీయ స్ధాయిలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల చెకింగ్, వెరిఫికేషన్ కోసం ఈసీకి ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి. ఇందులో లోక్ సభ సీట్లలో 8, అసెంబ్లీ కోసం 3 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వైసీపీ తరఫున విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్ల లోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గజపతినగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈసీ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాలలో వెరిఫికేషన్ ప్రక్రియప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అనంతరం ఈవీఎంలను తిరిగి పరిశీలించి ఈసీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు వైసీపీ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications