India vs Bharat: ఇండియా పేరు మార్పుపై వైసీపీ స్టాండ్ ఇదే ! రోజా, వైవీ సుబ్బారెడ్డి చెప్పిందిదే..
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియా పేరు మార్పు చర్చ నడుస్తోంది. రెండు రోజుల క్రితం జీ20 సదస్సు అతిధులకు విందు ఆహ్వానంలో కేంద్రం ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరు పెట్టిందనే విషయం తెలియగానే మొదలైన ఈ చర్చ తాజాగా బ్రిక్స్ సదస్సు, ఆసియాన్-ఇండియా సదస్సుల ఆహ్వానాల్లోనూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరు వాడినట్లు తెలియగానే మరింత ఎక్కువైంది. దీనిపై ఇప్పటికే విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు కూడా స్పందిస్తున్నాయి.
ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్నవార్తలపై ఇవాళ వైసీపీ స్పందించింది. ఇండియా పేరు మార్పుపై మంత్రి ఆర్కే రోజాతో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పటికే కేంద్రంలో ఎన్డీయే సర్కార్ తో వైసీపీ సత్సంబంధాలు కొనసాగిస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ఇండియా పేరు మార్పుపై మీడియా ప్రశ్నలకు స్పందించారు. ఇండియా పేరును భారత్ గా మార్చడంలో తనకు ఎలాంటి తప్పు కనిపించడం లేదని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. అలాగే ఇంగ్లీష్ లో ఇండియా అనడం కంటే తెలుగులో భారత్ అనడం చాలా బాగుందని రోజా కితాబిచ్చారు. తద్వారా భారత్ గా పేరు మారితేనే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి సైతం ఇండియా పేరు మార్పుపై స్పందించారు. ఇండియా ను భరత్ గా మార్పు చేస్తే తప్పులేదని సుబ్బారెడ్డి తెలిపారు. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని మాత్రమే కేంద్రాన్ని కోరారు. గతంలో కూడా పలు దేశాలు పేర్లు మార్చుకున్నాయంటూ సుబ్బారెడ్డి కేంద్రం ప్రతిపాదనలకు మద్దతుగా వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ అభిప్రాయం ఇదేనని తేలిపోయింది.












Click it and Unblock the Notifications