అసెంబ్లీ సమావేశాలపై జగన్ కీలక నిర్ణయం-బీఏసీ భేటీకి డుమ్మా !
ఏపీ అసెంబ్లీ సమావేశాల రోజే విపక్ష వైసీపీ నిరసనలు చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు నల్ల కండువాలతో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసారు. అనంతరం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బీఏసీ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీకి హాజరు కాకుండా వైసీపీ దూరంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మిగతా సెషన్ పైనా కీలక నిర్ణయం తీసుకుంది.
రేపు, ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ అండతో వైసీపీ నేతలు, కార్యకర్తలపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న వైసీపీ.. రేపు దీనిపై ఢిల్లీలో ధర్నా చేపట్టబోతోంది. దీనికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఎలాగో అసెంబ్లీకి వచ్చే వీలు ఉండదు. అలాగే ఢిల్లీ ప్రయాణం ముగించుకుని ఎల్లుండి రాష్ట్రానికి తిరిగి రానుండటంతో ఆ రోజు కూడా వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండిపోనుంది.

ఇవాళ అసెంబ్లికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసలనలకే పరిమితం అయ్యారు. గవర్నర్ ప్రసంగంలో గత వైసీపీ పాలనపై విమర్శలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పొగడ్తలు ఉండటంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అనంతరం బయటికి వెళ్లిపోయిన వైసీపీ ప్రజాప్రతినిధులు జగన్ తో భేటీ అయ్యారు. రేపు, ఎల్లుండి కార్యాచరణపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాల్లో మిగిలిన రోజులు సభకు హాజరు కాకూడదని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications