ముందస్తుపై వైసీపీ స్వరంలో మార్పు ? ఏ క్షణంలో ఎన్నికలొచ్చినా రెడీ అన్న సజ్జల..!
ఏపీలో ముందస్తు ఎన్నికలపై గత ఏడాది కాలంగా విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన ముందస్తు ఎన్నికల దిశగా క్యాడర్ ను సన్నద్ధం చేస్తూనే ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ కూడా గడప గడపకూ ప్రభుత్వం వంటి కార్యక్రమాలతో తన ఎన్నికల సన్నద్దతను చేపట్టింది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై ఢిల్లీలోనూ సందడి పెరిగేసరికి ఇక రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విపక్షాలు భావించాయి.
కానీ ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికార వైసీపీ మాత్రం తాము ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు ఐదేళ్లు పూర్తిగా పాలించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెబుతూ వచ్చింది. ముఖ్యంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పలుమార్లు ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఢిల్లీలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు కేంద్రంతో అన్నీ మాట్లాడుకుని వచ్చేశారన్న ప్రచారం జరిగినప్పుడు కూడా సజ్జల దీన్ని తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా ఆయన టోన్ మారినట్లు కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధంగా ఉందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ సొంత పార్టీలోనే చర్చనీయాంశమవుతున్నాయి. ఇన్నాళ్లూ ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదంటూ చెబుతూ వచ్చిన సజ్జల.. ఇప్పుడు సడన్ గా ఎన్నికలు ఎప్పుడొచ్చినా అనే పదం వాడటంతో ముందస్తుగా ఎన్నికలు రాబోతున్నట్లు సజ్జల హింట్ ఇచ్చేశారా అన్న చర్చ జరుగుతోంది. అలాగే వైసీపీ వైఖరి కూడా ఈ మధ్య పరిణామాలతో ఏమైనా మారిందా అన్న చర్చ కూడా మొదలైంది.
నిన్న ఎన్డీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట-చిల్లకల్లు రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. జగన్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 శాతం కూడా చేయలేదన్నారు. ఎల్లో మీడియాను ఆసరాగా చేసుకుని చంద్రబాబు, పవన్ పార్టీల్ని బతికించుకోవాలని చూస్తున్నారన్నారు. వైసీపీ సర్కార్ పై చేసేందుకు విమర్శలు లేక చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని సజ్జల విమర్శించారు.












Click it and Unblock the Notifications