'నేను.. మీ అందరికీ ఎందుకు చెబుతున్నానో తెలుసా'?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో తరుచుగా సమావేశమవుతున్న ముఖ్యమంత్రి జగన్ ఎట్టి పరిస్థితుల్లోను గెలిచి తీరాల్సిందేనని, మనకు రెండో ఆప్షన్ లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. తాను ఇంతలా కోరుకోవడానికి, ఎన్నికలను గట్టిగా ఎదుర్కోవడానికి కారణమేంటో దాపరికం లేకుండా వారికి వివరిస్తున్నారు.

చంద్రబాబు చురుగ్గా ఉండకపోవచ్చు?
రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి వయసు 72 సంవత్సరాలు. ఈ ఎన్నికల వరకు ఆయన చురుగ్గా ఉండగలుగుతారు. మరో 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలంటే బాబు వయసు 77 సంవత్సరాలవుతుంది. ఇప్పుడున్నంత చురుగ్గా అప్పుడు ఉండలేరు. అంతేకాకుండా వైసీపీ నాయకులు దుష్టచతుష్టంగా పరిగణిస్తున్నదానిలో 'ఈనాడు' దినపత్రిక కూడా ఉంది. సంస్థ అధినేత రామోజీరావు కూడా మరో 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నంత చురుగ్గా ఉండలేరని భావిస్తున్నారు.

రేపు గెలిస్తే 30 సంవత్సరాలు మనదే?
'ఆంధ్రజ్యోతి', 'ఏబీఎన్', 'టీవీ-5' లాంటివాటిని కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సులువుగా ఎదుర్కోవచ్చని జగన్ భావిస్తున్నారు. ఆయన ఈ విషయాలనే పదే పదే ప్రస్తావిస్తూ కష్టించి పనిచేయాలని, పనితీరు మెరుగుపడకపోతే సీటివ్వనని తేల్చేస్తున్నారు. తర్వాత తనను విమర్శించినా ఎటువంటి బాధ ఉండదన్నారు. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగలిగితే 30 సంవత్సరాలపాటు మన పార్టీనే అధికారంలో ఉంటుందని, తిరుగే ఉండదని స్పష్టం చేస్తున్నారు.

మితిమీరిన విశ్వాసం వద్దు!
ఇటీవలి కాలంలో జరుగుతున్న నియోజకవర్గ సమీక్షల్లో జగన్ గట్టిగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో గెలుపొంది వైసీపీ బలంగా ఉండటంతో పార్టీ శ్రేణులు మితిమీరిన విశ్వాసంతో ఉన్నారని, ఇది పార్టీకి చేటు చేస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో రానున్న ఎన్నికల్లో కూడా గెలుపు తమదేననే భావనతో ఉన్నారని, సరిగా పనిచేయడం కూడా మానుకున్నారని, ప్రజల్లోకి వెళ్లకపోతే అధికారం దక్కదంటూ.. గెలుపు వైసీపీదేననే ఆలోచనలను విడనాడాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications