చిత్తూరు జిల్లాలో శివాలయ ప్రాంగణంలో వైసీపీ రంగులు- ఎందుకిలా చేశారని అడిగితే గప్ చుప్...
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ వైసీపీ రంగులు వేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టులో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ శివాలయం ప్రాంగణంలో ఉన్న ఓ రైతు భరోసా కేంద్రానికి వైసీపీ రంగులు వేయడంతో స్దానికులు భగ్గుమన్నారు. అధికారులను నిలదీశారు. అయినా వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం ఐరాల మండలంలో దామలచెరువు-పాటూరు రహదారి పక్కన చుక్కావారిపల్లి క్రాస్ వద్ద శ్రీ అర్ధనారీశ్వరాలయం ఉంది. పొరుగున ఉన్న వేదగిరివారిపల్లి, గుండ్లపల్లి పంచాయతీలతో పాటు దామలచెరువు గ్రామాల ప్రజలు ఇక్కడ స్వామి వారికి నిత్యం పూజలు చేస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో స్ధానిక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గర్భాలయానికి అనుగుణంగా ఓ దాత నిర్మించి ఇచ్చిన గదికి స్ధానిక వైసీపీ నేతలు రెండు రోజుల క్రితం పార్టీ రంగులు వేశారు. దీంతో గుడి ప్రాంగణంలో పార్టీ రంగులు ఎలా వేస్తారని స్ధానికులు ఈవోను నిలదీశారు. అయినా సమాధానం రాలేదు.

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన కేసులను విచారించిన హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే వాటి రంగులు మార్చాలని ఆదేశాలు ఇచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వం పలుచోట్ల కొత్త రంగులు వేయడం ప్రారంభించింది కూడా. ఇలాంటి తరుణంలో తాజాగా మరికొన్ని చోట్ల వైసీపీ రంగులు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications